Dharmapuri | ధర్మపురి, మార్చి 22: జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి అనుబంధమైన ఉగ్ర నరసింహస్వామి ఆలయంలో అధికారులు భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. భక్తుల కోరికలు తీర్చే ఎంతో పవిత్రమైన అల్లు బండపై కూలర్‌ను ఉంచారు. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ అల్లు బండ ఎంతో మహిమ గలదని స్థల పురాణం చెబుతోంది. భక్తిశ్రద్ధలతో తమ కోరికలను మనసులో అనుకుని.. స్వామివారి నామాన్ని జపిస్తూ ఒక నాణేన్ని భక్తులు అల్లు బండపై నిలబెడతారు. అప్పుడు ఆ కాయిన్ అలాగే నిలబడితే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం. అంతటి మహిమ గల పవిత్రమైన అల్లుబండపై ఒక అపరిశుభ్రమైన వస్త్రాన్ని ఉంచి, ఆ వస్త్రంపై కూలర్ ఉంచారు. అయితే అయితే ఈ కూలర్ భక్తుల సౌకర్యార్థం అనుకుంటే పొరపాటే. రాత్రిపూట సిబ్బంది నిద్రించే సమయంలో ఈ కూలర్‌ను భక్తులు ఏర్పాటు చేసుకుని ఉంటారని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
భక్తులు అల్లు బండకు అత్యంత దగ్గరకు వెళ్తే పవిత్రమైన బండకు కాళ్లు తగిలే ప్రమాదం ఉందని ఇనుప బొంగులతో ఒక కంచెను ఏర్పాటుచేశారు. కానీ బ్రహ్మోత్సవాల వేళ మాత్రం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ అల్లు బండను కూలర్ స్టాండ్‌గా మార్చేశారు. పవిత్రమైన అల్లుబండకు పూర్తి దగ్గర వరకు భక్తులు వెళ్లకుండా కంచె ఏర్పాటు చేసి ఇప్పుడు బండపై కూలర్ ఉంచడం ఏమిటని భక్తులు చర్చించుకుంటున్నారు. అయితే ఆలయంలో కొందరు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడినట్లు స్పష్టంగా అర్థం అవుతుందని భక్తులు ఆరోపిస్తున్నారు.