గంభీరావుపేట, నవంబర్ 13: ఐఏఎస్ అయిండంటేనే వేరే వ్యాపకాలు లేకుండా కేవలం పుస్తకాలతో కుస్తీ పట్టడం అనుకుంటాం.. కానీ ఇందుకు విరుద్ధంగా తనలోని కొత్త కోణాన్ని చూపెట్టారు ఈ యంగ్ ఐఏఎస్. చదువులో టాప్‌లో ఉంటూనే తనకిష్టమైన డ్యాన్స్‌లోనూ కేక పుట్టించారు. కాలేజీ రోజుల్లో చేసిన డ్యాన్స్‌లతో తోటి విద్యార్థులను ఉర్రూతలూగించారు. ఆయనే ఇటీవలే జగిత్యాల జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా తొలిసారి బాధ్యతలు స్వీకరించిన మకరంద్.. కాలేజీ డేస్‌లో ‘ముక్కాలా.. ముక్కాబులాపై డ్యాన్స్ చేసి ప్రభుదేవాను మరిపించారు. ‘బుట్ట బొమ్మ’ పాటలపై తాను చేసిన డ్యాన్స్ వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఫిదా అవుతూ యంగ్ ఐఏఎస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మండలంలోని మల్లారెడ్డిపేటకు చెందిన మంద మకరంద్‌కు 28 సంవత్సరాలు. అతి చిన్న వయసులోనే జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మకరంద్ తండ్రి సురేశ్, తల్లి నిర్మల. ఇద్దరూ సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. మకరంద్ సిరిసిల్లలో ఏడో తరగతి వరకు చదివారు. ఆరోజుల్లోనే బాల మేధావిగా పేరు గాంచారు. చదువులోనే కాదు అతడికి డ్యాన్స్ కూడా అంటే చాలా ఇష్టం. 8వ తరగతి నుంచి పదవ తరగతి వరకు గుంటూరు కేకేఆర్ గౌతమ్ మోడల్ స్కూల్లో చదివి 585/600 మార్కులు సాధించారు. అనంతరం శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ చదివి ఎంపీసీ 992/1000 మార్కులు సాధించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ రాసి ఇంజినీరింగ్ విభాగంలో రాష్ట్ర స్థాయి 6వ ర్యాంక్, ఆలిండియా ఐఐటీలో 9వ ర్యాంకు సాధించి ముంబైలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. సివిల్ సర్వీసెస్ పరీక్ష 2019లో రాయగా మొదటి ప్రయత్నంలోనే మకరంద్ ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. తదనంతరం మొదటగా జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. స్కూల్ డేస్ నుంచి అతడికి డ్యాన్స్ అంటే ఇష్టం. అయితే ముంబైలో ఐఐటీ చదువుతుండగా కాలేజీ సెమినార్లో మకరంద్ చేసిన అద్భుతమైన డ్యాన్స్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో స్వగ్రామంతోపాటు నెటిజన్లు ‘స్టెప్స్ సూపర్.. యంగ్ ఐఏఎస్’ అంటూ అభినందనలు తెలుపుతున్నారు.