Godavarikhani | కోల్ సిటీ , మార్చి 23 : హైదరాబాద్ తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 28, 29 తేదీల్లో గోదావరిఖనిలో ‘నల్ల వజ్రం’ ఉగాది పురస్కారాలకు 60 మందిని ఎంపిక చేసినట్లు నిర్వహణ కమిటీ కన్వీనర్, ఇష్టా జాతీయ సభ్యులు కే స్వామి తెలిపారు. గోదావరిఖని తిలక్ నగర్ లో సోమవారం నిర్వహించిన కమిటీ సమావేశంలో సీనియర్ కళాకారులు మేజిక్ రాజాతో కలిసి ఆయన మాట్లాడారు. స్థానిక కళాకారుడు, అకాడమీ వ్యవస్థాపకుడు సంకె రాజేష్ కోల్బెల్ట్ ప్రాంత కవులు, కళాకారులు, క్రీడాకారులు, పలు రంగాల్లో ప్రతిభ కలిగిన వారిని సత్కరించే ఉద్దేశంతో 2021లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు, 2023లో సుమారు 125 మందికి నల్ల వజ్రం పురస్కారాలను ప్రధానం చేశారన్నారు.
ఈ సంవత్సరం 60 మంది ప్రతిభావంతులైన కళాకారులను ఈ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ అనవాయితీ ప్రతీ ఏటా కొనసాగుతుందన్నారు. ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఘంటాడి కృష్ణ, సంగీత విభావరి, సినీ నటులతోపాటు స్థానిక ఎమ్మెల్యే, మేయర్ రామగుండం సీపీ, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా కళాకారులకు పురస్కారాల ప్రదాన ఉంటుందన్నారు. కళాకారులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీనియర్ కళాకారులు దయానర్సింగ్, చంద్రపాల్, జనగాను రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.