karimnagar | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 23 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్న సిబ్బందికి ఇంకా పారితోషకం అందలేదు. ఐదు నెలలుగా ఎదురుచూస్తున్నా ఇంకా వారి ఖాతాల్లో జమ కావటం లేదు. సర్వే పూర్తైన వెంటనే సిబ్బంది ఖాతాల్లో నేరుగా వేసేందుకు ప్రభుత్వం మొదట నిధులు విడుదల చేసినా.. ఆ తర్వాత నిలిపేసింది. ఎంపీడీవోల ద్వారా పంపిణీ చేస్తామని చెప్పినా, ఇప్పటివరకు ఖాతాల్లో జమ కాలేదు. దీంతో, వారంతా కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతుండగా, ప్రభుత్వ తీరుతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన ప్రజల రిజర్వేషన్లు పెంచుతామని ప్రభుత్వం చేసిన ప్రకటన మేరకు గతేడాది నవంబర్ నెలలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) చేసింది.
జిల్లావ్యాప్తంగా 3,171మంది సిబ్బందిని సర్వే కోసం వినియోగించుకున్నది. వీరిలో 2,864 మంది ఎన్యూమరేటర్లు, 287 మంది సూపర్వైజర్లు, 20 మంది ప్రత్యేకాధికారులతో పాటు సర్వేలో సేకరించిన వివరాలు ఆన్లైన్లో పొందుపర్చేందుకు 2,256 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లను వినియోగించారు. అందులో వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, సీవోలతోపాటు పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, మండల స్థాయి అధికారులు ఉన్నారు. వీరంతా గతేడాది నవంబర్ 9 నుంచి 24 వరకు ఇంటింటికీ తిరిగి సర్వే చేపట్టారు. ఆయా కుటుంబాల సమాచారాన్ని ప్రత్యేకంగా ముద్రించిన ఫాంలలో నమోదు చేశారు. ఎలాంటి తప్పొప్పులూ లేకుండా క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సర్వే వివరాలు వెబ్సైట్లో నమోదు చేసేందుకు డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించారు. వారు కూడా నిర్దేశించిన గడువులోపే అప్లోడ్ చేశారు. అప్పగించిన సర్వేను గడువులోపే విజయవతంగా పూర్తి చేసిన అనంతరం సర్వే సిబ్బంది ఖాతాల్లో పారితోషకం జమచేయాలి.
నిజానికి సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్లు ఒక్కొక్కరికి ₹10వేలు, సూపర్వైజర్లకు ₹12 వేలు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ప్రైవేట్ వ్యక్తులైతే ఒక్కో షిప్టుకు ₹750, ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించే కాంట్రాక్టు ఆపరేటర్లకు ₹350 చొప్పున అందించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం ముందే నిధులు విడుదల చేసింది. పూర్తి కాగానే సిబ్బంది ఖాతాల్లో జమచేయాలని జిల్లా యంత్రాంగంను ఆదేశించింది. ఇందుకనుగుణంగా చెల్లించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. సర్వేలో పాల్గొన్న వారు అందజేసిన బ్యాంక్ ఖాతాల వివరాలు కూడా ట్రెజరీకి గతేడాది డిసెంబర్లోనే పంపినట్లు సంబందిత అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ప్రభుత్వం అంతలోనే ఆ నిధులు వెనక్కు తీసుకుని, ఇతర అవసరాలకు వినియోగించినట్లు తెలుస్తుంది. నాటినుంచి నేటి వరకు నిధులు విడుదల చేయకపోవటంతో సర్వే చేసిన సిబ్బంది పడుతున్న బాధలు వర్ణనాతీతంగా మారాయి.
సర్వేలో పాల్గొన్నవారిలో కొద్దీ మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుండగా, అత్యధికులు ప్రైవేట్ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న వారే ఉన్నారు. ప్రభుత్వ సూచనతోనే వీరు సర్వేలో పాల్గొన్నా, ఆ సంస్థలు వేతనం ఇవ్వలేదు. ప్రభుత్వం ఇంకా పారితోషకం విడుదల చేయలేదు. దీంతో, తాము కుటుంబ పోషణకు నానా తంటాలు పడాల్సి వస్తుందంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా వారికి చెల్లించాల్సిన సర్వే డబ్బులు వెంటనే సిబ్బంది ఖాతాల్లో జమచేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సొంత ఖర్చులతో సర్వే చేశాం… ఇప్పటివరకు డబ్బులు రాలే : మంద నాగలక్ష్మి, సప్తగిరి కాలనీ, కరీంనగర్
సమగ్ర ఇంటింటి సర్వే చేయాలనే అధికారుల సూచనతో గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నగరంలోని పలు డివిజన్ లలో ఆటోలో ఇల్లిల్లు తిరిగి సర్వే చేశాను. ఆటో చార్జీలు నేనే చెల్లించాను. పిల్లాపాపలను వదిలిపెట్టి సర్వే వివరాలను డాటా ఎంట్రీ కూడా చేశాను. వివరాలు ఆన్లైన్లో పొందుపరిచిన వెంటనే డబ్బులు చెల్లిస్తామని అధికారులు చెప్పారు. ఐదు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు మా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయలేదు. సర్వేకు ముందే విడుదల చేశామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు పంపిణీ చేయకపోవడం సముచితం కాదు. వెంటనే మా ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి.