జగిత్యాల రూరల్: పేదల అభివృద్ధిని, సంక్షేమం కాంక్షించాల్సిన ముఖ్యమంత్రికి ( Chief Minister ) ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల కనీసం సోయి లేకపోవడం విచారకరమని జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ ( ZP Chairperson) దావ వసంత సురేష్( Dava Vasanta Suresh ) ఆరోపించారు. జగిత్యాల మండలం మోరపల్లి గ్రామంలో శనివారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో ఆమె మాట్లాడారు.
రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. మొక్కజొన్న కొనుగోలు సమయం వచ్చినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన లేని పాలన సాగుతుందని విమర్శించారు. ఆరుగాలం కష్టపడి పనిచేస్తే ఇవాళ దళారుల దగ్గర రైతు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రస్తుతం రూ. 2,400 మద్దతు ధర ఉంటే రూ. 1,850 అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు . సగటున క్వింటాలుకు రూ. 500 నష్ట పోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
ఒక్కో రైతుకు 18 క్వింటాళ్ల పరిమితి నిబంధన ఎందుకని ఆమె ప్రశ్నించారు. పండించిన పంట అమ్ముకునేందుకు నిబంధనలు పెట్టడం విచారకరమని అన్నారు. దేశానికి అన్నం పెట్టె రైతన్న ఖ్యాతిని ప్రపంచపటంలో నిలిపిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని వెల్లడించారు. తెలంగాణ ను రైస్బౌల్ గా నిలిపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని వివరించారు. రైతాంగం కోసం రైతు బంధు, 24 గంటల కరెంట్, రైతు బీమాతో పాటు కరోనా కష్ట కాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, రైతులను ఆదుకున్నారని వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వం నడుపుతున్నననే సోయి లేక రైతు జీవితాలను, ప్రజలను ఆగం చేస్తున్నారని విరుచకుపడ్డారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో షరతులు లేకుండా పంటలను కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రైతు ఇబ్బందులను కొనుగోలు కేంద్రానికి వెళ్లి తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ , ప్రభుత్వ యంత్రంగానికి విజ్ఞప్తి చేశారు. ఆమె వెంట ప్యాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, నాయకులు కమలాకర్ రావు, గంగారావు ,కరుణాకర్ రావు, గంగారెడ్డి, శరత్, లింగారెడ్డి, బేతి రాజీ రెడ్డి, రైతులు , మహిళలు పాల్గొన్నారు.