BRSV leader | సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 6: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా.. విద్యా శాఖ మంత్రి, సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ మండలం అగ్రహారం లోని జేఎన్టీయూ కళాశాల సమస్యలు పట్టించుకోకపోవడం సిగ్గు చేటని బీఆర్ఎస్వీ నేత జక్కుల నాగరాజు యాదవ్ మండిపడ్డారు. కళాశాల దయనీయ పరిస్థితిపై పలు పత్రికల్లో కథనాలు రావడంతో ఆయన శనివారం స్పందించి విలేకరులతో మాట్లాడారు. కళాశాలను పట్టించుకోవడం బాధాకరంగా ఉందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాను విద్యాహబ్ గా మార్చాలని పలు విద్యా సంస్థలు తీసుకొచ్చారని, అందులో భాగంగానే జేఎన్టీయూ కళాశాలను ప్రారంభించారని గుర్తుచేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఆ కాలేజీని పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత నాయకులు జేఎన్టీయూని ఎందుకు పట్టించుకోవడం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విప్ ఆది శ్రీనివాస్ స్పందించి కళాశాలకు మెరుగైన వసతుల కల్పించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కళాశాలకు తాళం వేయడం దారుణమని, వెంటనే ప్రభుత్వం స్పందించి కళాశాలకు శాశ్వత భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.