SIR Notices | గంగాధర, సెప్టెంబర్ 7 : స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (సర్) లో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ అస్తవ్యస్తంగా సాగుతోందని గంగాధర మండలం ఒద్యారం గ్రామానికి చెందిన బాలసంకుల అనంతరావు ఆరోపించారు. ప్రత్యేక సమగ్ర సవరణలో అధికారులు తనకు తప్పుడు నోటీసులు పంపించారని సోమవారం గంగాధర ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అనంతరావు మాట్లాడుతూ 2002 ఓటరు జాబితా ప్రకారం తన తల్లి సత్యమ్మ వయసు 90 ఏళ్లుగా తన వయసు 40 ఏళ్లుగా ఉందని తెలిపారు. 2002 ఓటరు జాబితా ప్రకారం అన్యుమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి బీఎల్ఓకు అందజేసినట్లు తెలిపారు.
ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా తనకు, తన తల్లికి వయసు వ్యత్యాసం 15 సంవత్సరాల లోపు ఉందని అధికారులు నోటీసులు పంపారని వివరించారు. 2002 ఓటరు జాబితా ప్రకారం తనకు తన తల్లికి వయసు వ్యత్యాసం 50 ఏళ్లు ఉందని పేర్కొన్నారు. అధికారులు సమగ్ర విచారణ చేయకుండానే, ఓటరు జాబితాను పరిశీలించకుండానే వయసు వ్యత్యాసం తక్కువగా ఉందంటూ నోటీసులు పంపించడం ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొన్నారు. ఇది తాను ఒక్కడినే పడుతున్న ఇబ్బంది కాదని, వివిధ కారణాలు చెబుతూ గ్రామంలో మరో 360 మందికి అధికారులు నోటీసు ఇచ్చారని తెలిపారు. తప్పుడు నోటీసులతో ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.