Mla Kavvampalli | కలెక్టరేట్, ఏప్రిల్ 5: ‘దళిత జాతి అభ్యున్నతి కోసం పాటుపడిన మహానేతలకు మనమిచ్చే గౌరవం ఇదేనా..? మహానీయుడు జర్జీవన్రామ్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు గింతమందే వస్తారా..? సభసాయంత్రం నిర్వహించుకుందామంటున్నరు.. అసలు మనం చెప్తే వినేందుకు వచ్చింది. ఎంతమంది? వేదికపై ఎంతమంది ఉన్నారో… కింద అంతమందే ఉన్నారు. తూతూ మంత్రంగా జనాలను తరలిస్తారా? ఇగ్రీవన్ ఆలోచన విధానం మాటలకే తప్ప చేతల్లో చూపటం లేదు’ అంటూ మానకొండూరు ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, బాబు జగ్జీవన్‌రామ్ జయంత్యుత్సవ కమిటీ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
నగరంలోని మంచిర్యాల చౌరస్థాలో గల బాబు జగ్జీవన్‌రామ్ కాంస్య విగ్రహం వద్ద ఆయన 118వ జయంత్యుత్సవ వేడుకలు జిల్లా షెడ్యూలు కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు ఇతర జిల్లా ఉన్నతాధికారులు, చొప్పదండి ఎమ్మల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సత్తు మల్లేశ్ తో పాటు జిల్లాలోని పలు దళిత సంఘాల ప్రతినిధులు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచి కొద్దిసంఖ్యలోనే జనాలు తరలివచ్చారు.
ఉదయం 10.30 గంటలకే మొదలైన కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగుతూనే ఉండగా, సభకు హాజరైన ప్రజలు ఒక్కొక్కరుగా వెనుదిరిగిపోతున్నారు. అయన మాట్లాడుతుండగా ఉత్సవ కమిటీ చైర్మన్ వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి వారించారు. దీంతో ఓ దళితనేత కవ్వంపల్లి మాటలు పట్టించుకోకుండానే ఆవేశపూరితంగా మాట్లాడుతూ, సభ సాయంత్రం దాకా నిర్వహించుకుందామంటూ, మీరంతా అప్పటిదాకా ఉండాల్సిందేనంటూ అనడంతో, ఆగ్రహానికి గురైన కవ్వంపల్లి సభ నిర్వాహకులు, సభలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న వారిని తూర్పార బట్టారు.
మహానాయకుడు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల నిర్వహణపై ఇంత నిర్లక్ష్యం వహిస్తే ఎలా? సభలో మాట్లాడేందుకు చూపుతున్న ఉత్సాహం ప్రజలను తరలించటంలో ఎందుకు చూపలేదు. సాయంత్రం వరకు సభ నిర్వహించుకునేందుకు ఎవరికి అభ్యంతరం లేదని, కానీ, వినేవారు ఎంతమంది ఉన్నారని, మహానీయుల చరిత్ర, వారి ఉద్యమ స్ఫూర్తిని క్షేత్రస్థాయిలో దళిత జనులకు చాటడంలో ఎందుకు వెనుకబడుతున్నారంటూ ప్రశ్నించారు. నాటి నిబద్ధత, విధేయత నేటి యువతలో ఎందుకు కనిపించడం లేదని, నాయకులుగా ఎదుగుకున్న మనమంతా, మహానీయుల పట్ల కిందిస్థాయిలో అవగాహన కలిగించటంలో వైఫల్యమెందుకు చెందుతున్నట్లో ఎస్సీ సామాజిక వర్గ అంతర్గత సమావేశాల్లో చర్చించుకోవాల్సిన అవసరమున్నదంటూ బాహాటంగానే అన్నారు. దీంతో సభావేదికపై ఉన్న వారంతా కిమ్మనకుండిపోయారు. సభ నిర్వహణలో నిర్వాహకుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, మహానుభావుని జయంతి ఉత్సవాల నిర్వహణకు వచ్చి పబ్లిక్ కోసం ఎదురుచూడటం బాధాకరంగా ఉందని, మన సభకు మనమే స్వచ్ఛందంగా రాకపోవటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.