Quality ‘control’ | కోల్ సిటీ , జూన్ 28: రామగుండం నగర పాలక సంస్థలో థర్డ్ పార్టీ క్వాలిటీ ‘కంట్రోల్’ తప్పుతోంది. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులను రాజీ పడకుండా థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ పరిశీలించి ధృవీకరించేది. కానీ, ఇప్పుడు అభివృద్ధి పనుల పరిశీలనలో గాడి తప్పుతోంది. కమిషన్లు తీసుకొని థర్డ్ పార్టీ సర్టిఫికెట్ ఇస్తోంది. దీనితో కాంట్రాక్టర్లకు బిల్లులు జారీ చేస్తున్నారు. అలాగే భారీ లెస్ టెండర్లతో పనులను దక్కించుంటున్నారు.
ఇంజనీరింగ్ విభాగం అధికారులు కార్యాలయంకే పరిమితం అవుతుండగా, కాంట్రాక్టర్లు ఆడింది ఆట.. పాడింది పాటగా మారుతోంది. కార్పొరేషన్లో 2023లో మంజూరు చేసిన రూ.100 కోట్లతో జరుగుతున్న రోడ్లు, డ్రైనేజీలు, ఇతరత్రా అభివృద్ధి పనులను ఏఈలు గానీ, వర్క్ ఇన్స్పెక్టర్లు గానీ ఒక్కరు కూడా క్షేత్ర స్థాయికి వెళ్లి అక్కడి పనుల్లో నాణ్యతను పరిశీలించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
గత ప్రభుత్వ హయాంలోనే రూ.100 కోట్లు మంజూరు
కాగా, రామగుండం కార్పొరేషన్లో టీయూఎఫ్ ఐడీసీ నుంచి రూ. వంద కోట్లతో జీవో నం.584 ద్వారా 17, ఆగస్టు 2023లో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచారు. వీటిలో గోదావరిఖని లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్, మేదరిబస్తీ, ఉల్లి బజారులో రూ.10 కోట్లతో భూగర్భ డ్రైనేజీలు, మరో రూ.12 కోట్లతో సీసీ రోడ్లు, రూ.3.50 కోట్లతో వీధి లైట్ల ఏర్పాటు, రూ. 4 కోట్లతో పాత విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్త స్తంభాల ఏర్పాటు పనులను సుధాకరా ఇన్ఫ్రాటెక్ సంస్థ దక్కించుకోగా, ప్రస్తుతం అవే పనులు కొనసాగుతున్నాయి. అలాగే రూ.4 కోట్లతో గోశాల వెనుకాల పండ్ల మార్కెట్, కూరగాయల మార్కెట్ అభివృద్ధి పనులను శ్రీనిత కన్స్ట్రక్షన్ కు పనులను అప్పగించారు.
రూ.6.50 కోట్లతో డ్రైనేజీ, కల్వర్టుల నిర్మాణం, మరో రూ.10 కోట్లతో పలు కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం పనులను సిద్ధార్థ కన్స్ట్రక్షన్ కు పనులను అప్పగించింది. గోదావరి వద్ద గ్రేవీ యార్డుకు రూ.2కోట్లు, వాటర్ సప్లయ్ లైన్స్ పనులకు రూ.5 కోట్లు, 1వ డివిజన్ నుంచి 25వ డివిజన్ వరకు సీసీ రోడ్లు, బీటీ రోడ్లకు రూ.10 కోట్లు, 26వ డివిజన్ నుంచి 50వ డివిజన్ వరకు అవే పనులకు మరో రూ.10 కోట్లతో పనులు అప్పగించారు. రూ.2 కోట్లతో మహిళా కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం స్థల పరిశీలనలో ఉంది.
జంక్షన్ల అభివృద్ధికి రూ.2 కోట్లు, మున్సిపల్ ఆఫీసు నుంచి పైవింక్లయిన్ జంక్షన్ వరకు మధ్యస్త నిర్మాణాలకు రూ. 6 కోట్లు కేటాయించారు. గత బీఆర్ఎస్ హయాంలోనే ఈ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. రూ.2.80 కోట్లతో స్లాటర్ హౌస్ పునఃనిర్మాణం, ఎఫ్ఎన్టీపీ, యానిమల్ బర్త్ కంట్రోల్ భవనం, కస్తూర్బా హాస్టల్ నుంచి 6వ డివిజన్ వరకు డ్రైనేజీ, సీసీ, కల్వర్టుల స్లాబ్ పనులను పూర్తి చేశారు. అప్పుడు శాసనసభ ఎన్నికలు రావడంతో ఆగిపోయిన అభివృద్ధి పనులను ఇప్పుడు కొనసాగుతున్నాయి.
ఇంజనీరింగ్ విభాగం ఏం చేస్తోంది..?
కాగా, రామగుండం కార్పొరేషన్లో ఇంజనీరింగ్ విభాగం నిద్రపోతుందా? అన్న విమర్శలున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులతో పాటు 15వ ఆర్థిక సంఘం, పట్టణ ప్రగతి, ఎస్డీఎఫ్, వివిధ పరిశ్రమల సీఎస్సార్ నిధులు, సబ్ ప్లాన్ గ్రాంట్ల అభివృద్ధి పనుల్లో నాణ్యతను పరిశీలించేందుకు థర్డ్ పార్టీ క్వాలిటీ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించారు. కార్పొరేషన్లో లో ఒక ఈఈ, ఐదుగులు డీఈలు, నలుగురు ఏఈలతోపాటు ఔట్ సోర్సింగ్‌లో వర్క్ ఇన్స్పెక్టర్లు పని చేస్తున్నారు.
వీరిలో వర్క్ ఇన్స్పెక్టర్లు, ఏఈలు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పనులను పరిశీలించాల్సి ఉంటుంది. కానీ ధర్డ్ పార్టీ ఏజెన్సీ మీదనే భారం వేస్తున్నారు. సదరు ఏజెన్సీ మాత్రం పనులను పరిశీలించకుండానే కమిషన్లు తీసుకొని కాంట్రాక్టర్లకు సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. భూగర్భ డ్రైనేజీల నిర్మాణంలో కాంట్రాక్టర్లు తీసుకవచ్చిన పైపులను ఎక్కడ కొనుగోలు చేశారో కూడా వాకబు చేయడం లేదు. ఇక రోడ్లు, డ్రైనేజీలు, ఇతర పనుల్లో సిమెంట్ మిశ్రమంలో నాణ్యత ప్రమాణాలను అటు ఏజెన్సీ గానీ, ఇటు అధికారులు గానీ పరిశీలించడం లేదు. దీనితో అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే అదనుగా కాంట్రాక్టర్లు 45 శాతం భారీ లెస్ తో టెండర్లు వేసి పనులను దక్కించుకొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో థర్డ్ పార్టీ ఫీల్డు మీదకు వెళ్లి పనులను పరిశీలించాకే బిల్లుల చెల్లింపులు జరిగేవి.
ఇక ముందు ఒప్పందంలో షరతులు.. : జే అరుణ శ్రీ, కమిషనర్ (ఎఫ్ఏసీ)
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కార్పొరేషన్లో వివిధ అభివృద్ధి పనులకు అంచనా వ్యయంపై 25 శాతం కన్నా మించి లెస్ టెండర్ వేస్తే థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ కు తోడు ఇతర ఇంజనీరింగ్ అధికారులతో పరీక్షలు నిర్వహిస్తాం. నాణ్యత నిర్ధారించుకున్న తరువాతనే కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లిస్తాం. ఈ షరతులను కాంట్రాక్ట్ అగ్రిమెంట్లో ఇక ముందు పొందుపరుస్తాం. అన్ని అభివృద్ధి పనులు నాణ్యతగా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించాం.