KARIMNAGAR | కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 31 : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా, రాష్ట్ర ఆవిర్భావం రోజు ప్రారంభించబోతున్న రాజీవ్ యువ వికాస పథకం… జిల్లా యువతలో నైరాశ్యం నింపుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి లోని నిరుద్యోగ యువతకు ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి కల్పించబోతున్నామంటూ ప్రభుత్వం ప్రకటించినా.. ఆరు గ్యారంటీల అమలు మాదిరిగానే మారుతుందేమోననే.. అనుమానాలు యువతలో తలెత్తుతున్నాయి.
స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు సబ్సిడీ అందిస్తూ ప్రోత్సహిస్తున్నామంటూనే, అవసరమైన ఏర్పాట్లు చేయకపోవడంతో ధరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు మార్గదర్శకాలే సక్రమంగా రూపొందించకపోవడం పట్ల, నిరుద్యోగ యువతలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో ప్రభుత్వ సబ్సిడీ కోసం మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా అత్యధిక మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో కొంతమంది దరఖాస్తుల గ్రౌండింగ్ అయి, యూనిట్ల స్థాపన కూడా కావడంతో వారికి సబ్సిడీ విడుదలైంది. మరి కొంతమందికి గ్రౌండింగ్ అయిన యూనిట్లు స్థాపించుకోకపోవడంతో సబ్సిడీ విడుదల కాలేదు.
ఈ లోపే ఎన్నికల కోడ్ రావడంతో వాటికి పులిస్టాప్ పడింది. ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం గతంలో ఎంపికైన వారికి సబ్సిడీ విడుదల చేయాల్సి ఉండగా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోలేదు. గత ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలు రద్దు చేస్తున్నామంటూ చెప్పకనే చెప్పి, తిరిగి దరఖాస్తులు చేసుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు. దీంతో, వీరంతా యువ వికాస పథకం ద్వారా ప్రయోజనం పొందుదామని ఆశతో దరఖాస్తులు చేసుకునేందుకు మీసేవ కేంద్రాల్లోకి వెళితే, వెబ్సైట్ మొండి చేయి చూపుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ పథకాలకు ఎంపికైనట్లు చూపుతుండగా, వారు హతాశయులవుతున్నారు. తాము స్వయం ఉపాధి పథకాలకు ఎంపికైనా యూనిట్లే స్థాపించకపోతిమి. సబ్సిడీ ఎలా పొందామంటూ ప్రశ్నిస్తున్నారు. 2020 సంవత్సరం వరకు సబ్సిడీ పొందిన వారి వివరాలు ఆయా కార్పొరేషన్ల వెబ్ సైట్ ల నుంచి తొలగిపోగా, 2021 నుంచి దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలు మాత్రం తొలగించలేదు. వాస్తవానికి ఆయా కార్పోరేషన్ల అధికారులు జిల్లా నుంచి సబ్సిడీ పొందని వారి జాబితాలు రూపొందించి రాష్ట్ర కార్యాలయానికి పంపినా, అక్కడ తొలగించలేదని తెలుస్తోంది. ఎస్సీ కార్పొరేషన్ లో మాత్రం సంబంధిత అధికారుల చొరవతో డిలీట్ చేసినట్లు దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు.
క్షేమ పథకాల అమలకు రేషన్ కార్డును ప్రామాణికంగా మార్చిన ప్రభుత్వం, మంజూరులో మాత్రం ఇప్పటివరకు చలనం లేదు. కార్డులు లేని వారు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు చేసుకోవాలంటూ సూచించి, అట్టహాసంగా గ్రామసభలు నిర్వహించి, అర్హులైన వారి పేర్లు వెల్లడించారు. అనంతరం ప్రతి మండలానికి ఒక పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసి, జాబితాలో పేర్లు ఉన్న వారిలో ఐదుగురికి మంజూరి పత్రాలు అందజేశారు. మిగిలిన వారికి మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదు. దీనిపై నిరుద్యోగులు బాహటంగానే వ్యతిరేకించడంతో, రేషన్ కార్డు లేని వారు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని సూచించారు. దరఖాస్తుదారులు వాటి కోసం తహసిల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్లారిగేల తిరుగుతున్నా.. మా ఆదాయాన్ని మాత్రం ఇప్పటివరకు ధ్రువీకరించడం లేదంటూ వాపోతున్నారు. ఓవైపు ఏప్రిల్ 5 వరకే తుది గడువు విధించగా, వారం రోజుల కింద దరఖాస్తులు చేసుకున్న ఇప్పటివరకు సర్టిఫై చేయకపోవడం వెనుక అంతర్యమేంటని ప్రశ్న దరఖాస్తుదారుల్లో ఉద్భవిస్తున్నది.
అప్లై చేసుకున్న వారిలో 50 శాతం మందికి బ్యాంకులనుంచి రుణాలు ఇప్పించి, ఒక్కో యూనిట్‌కు గరిష్టంగా 80 వేల దాకా రాయితీ ఇవ్వబోతున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే మండలాల వారీగా ఎన్ని యూనిట్లు మంజూరు చేయనున్నారు? ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఎంతమందికి ఈ పథకం ద్వారా చేకూర్చబోతున్నారో.. కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు. దీంతో ఈ పథకంతో కూడా తమకు ప్రయోజనం చేకూరే అవకాశాలు తక్కువేనని నిరాశ, నిస్పృహలు నిరుద్యోగుల్లో వెల్లువెత్తుతున్నాయి.