Thimmapur | తిమ్మాపూర్, జనవరి 9 : ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ అంటే జిల్లాలో ఫేమస్. అయితే ఇక్కడ పని చేయడానికి వచ్చిన చాలా మంది ఎస్ఐలు ఒకరిద్దరు తప్పితే ఎక్కువ మంది నెగ్గలేకపోతున్నారు. అందులో ప్రధానంగా బీసీ వర్గానికి చెందిన అధికారులు ఇమడలేకపోతున్నారు. ఇటు బయట, లోపల రాజకీయాలను తట్టుకోలేకపోతున్నారు. దీంతో వచ్చిన కొద్దిరోజులకే ఏదో కారణం రెడీ చేసి పంపించేస్తున్నారు. అలా బలైన వాళ్లలో ముఖ్యంగా బీసీ వర్గానికి చెందిన వారే ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఎస్సై శ్రీకాంత్ గౌడ్ ఉండగా ఆయనపై అధికారి బురద జల్లి మరక వేసినట్టు సమాచారం.
అయితే ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో ఓ కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకుని మందు పట్టుకున్నఎస్సై తనపై అధికారి చెప్పినపట్టికీ పట్టించుకోకపోవడమే ప్రధాన కారణమని, అదే మనసులో పెట్టుకుని ఉన్నతాధికారులను పక్కదారి పట్టించారని విశ్వసనీయ సమాచారం. కారణమేదైనా ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ కుర్చీ బీసీ లకు అచ్చిరావడం లేదని, ఎక్కువకాలం లేకుండా చేస్తున్నారని బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్సై శ్రీకాంత్ విషయం కూడా అక్కసుతోనే బలి చేసినట్టు సమాచారం. నియోజకవర్గ ముక్య నేతకు అత్యంత దగ్గర వ్యక్తి కావడం.. అదే సమయంలో పై అధికారికి ప్రాధాన్యత తగ్గడంతో ఉన్నతాధికారినీ మచ్చిక చేసుకుని ఇబ్బంది పెట్టినట్టు బోగట్టా. అధికార పార్టీ, ప్రతిపక్షం అనే తడా లేకుండా న్యాయం ఎటుంటే అటు వైపే మొగ్గు చూపే ఎస్సై బదిలీ విషయం తెలుసుకున్న సామాన్యులు అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.