Korukanti Chander | పెద్దపల్లి కమాన్, జనవరి 26 : ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కోరుకంటి చందర్ ఆగ్రహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధుకర్‌తో కలిసి కోరుకంటి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమానత్వపు సమాజ స్థాపన కోసమే భారత రాజ్యాంగం రూపొందించబడిందన్నారు. కుల మతాలకతీతంగా దేశ పౌరులందరికీ సమాన న్యాయ సేవలు, ప్రయోజనాలు చేకూరాలనే ఉద్దేశ్యంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కార్యాచరణలో రాజ్యాంగాన్ని రచించినట్లు వివరించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాజ్యాంగ ప్రకారం అన్ని వర్గాలకు ప్రజలకు లబ్ధి చేకూరిందని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే ముందు వరుసలో నిలిపారని కొనియాడారు.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క పథకం సంపూర్ణంగా అమలు కావడం లేదని విమర్శించారు. ప్రకటనలు, శంకుస్థాపనలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేశా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే కేసుల్లో ఇరికించడం, దాడులు చేయడం పరిపాటి అయ్యిందన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్దంగా పాలన సాగడం లేదని నియంత పాలన సాగుతోందని ఆగ్రహించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ నాయకులు రఘువీర్‌సింగ్, మూల విజయారెడ్డి, దాసరి ఉష, గోపు అయిలయ్య యాదవ్, ఉప్పు రాజ్‌కుమార్, పెంచాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.