జగిత్యాల కలెక్టరేట్, మే 12 : అప్పటి దాకా ఆ చిన్నారి అల్లరితో సందడిగా ఉన్న ఆ ఇంటిలో విషాదం నిండింది. చాక్లెట్ కొనిచ్చేందుకు ఆ చిన్నారిని తీసుకొని పెద్దనాన్న బైక్‌పై వెళ్తుండగా, ఇంటి సమీపంలోనే అతివేగంగా వచ్చిన కారు ఆ ఇద్దరినీ బలితీసుకున్నది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లాకేంద్రంలోని హన్మాన్వాడకు చెందిన పాదం మల్లేశం(35), పాదం శేఖర్ అన్నదమ్ములు. ఇద్దరికి పెళ్లిళ్లు అయ్యాయి. అందరూ ఉమ్మడిగానే ఉంటారు. మళ్లేశంకు పిల్లలు లేరు. శేఖర్‌కు ఒక్క కూతురు వితన్వి (18 నెలలు) ఉంది. ఆ ఇంట్లో ఒకే ఒక్క పాప ఉండడంతో కుటుంబీకులు ఆమెను కంటికి రెప్పలా చూసుకునేవారు. సోమవారం రాత్రి వితన్వికి చాక్లెట్ కొనిద్దామని పెద్దనాన్న మల్లేశం పాపను బైక్‌పై ఎక్కించుకుని దుకాణానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇంటి సమీపంలోనే కండ్లపెల్లి వైపు నుంచి కారు అతివేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది.
దీంతో బైక్‌పై ఉన్న చిన్నారి ఎగిరి కిందడడం, మల్లేశం సైతం బైక్‌పై నుంచి పడిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఇంటి నుంచి వెళ్లిన క్షణాల వ్యవధిలోనే వితన్వి, మల్లేశం మృతిచెందడంతో చిన్నారి తల్లిదండ్రులు శేఖర్-నవ్య, కుటుంబ సభ్యులు రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, టౌన్ సీఐ వేణుగోపాల్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను జగిత్యాల జిల్లా దవాఖానకు తరలించారు. కాగా, కారు డ్రైవర్‌తోపాటు అందులోని మరో ఇద్దరు వ్యక్తులు ఫుల్లుగా మద్యం తాగి అతివేగంగా కారు నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. బైక్‌ను ఢీకొట్టిన కారు రోడ్డు పక్కనే ఉన్న తోపుడు బండిని సైతం ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత కారులో ఉన్న ముగ్గురు వ్యక్తుల్లోంచి ఒకరు పారిపోగా, ఇద్దరిని జగిత్యాల టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.