సుడా పనుల్లో అనుకున్నట్టుగానే కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యారు. పనుల పంపకాలు చేశారు. ఇదంతా కొంతమంది నేతల కనుసన్నల్లో జరిగినట్టు విశ్వసనీయ సమాచారం కాగా, రింగ్ అయ్యేందుకు మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు మంతనాలు జరిగినట్టు తెలుస్తున్నది. చివరకు అంతా కలిసి ఓ ఒప్పందానికి వచ్చి రింగ్‌గా మారినట్టు తెలిసింది. అందులో కార్పొరేషన్ బయట చేపట్టే 35 పనులకు ఇతరులు టెండర్లు వేయరాదని ఆ కొంతమంది నేతలు ఆదేశాలు ఇవ్వగా.. ఆ మేరకు అగ్రిమెంట్ జరిగినట్టు కాంట్రాక్టర్ల ద్వారా తెలుస్తున్నది. అందుకోసం పనులు తీసుకునే కాంట్రాక్టర్లు అంచనా విలువపై భారీగా కమీషన్ ఇవ్వాలన్న నిబంధన పెట్టినట్టు తెలియగా, ఈ విషయంలో ఓ కాంట్రాక్టు అసోసియేషన్ ముందస్తుగా ఒక్కో టెండర్దారుడిని నుంచి రూ.50వేలు వసూలు చేసినట్టు తెలిసింది. ఇది ఇలా ఉంటే.. కొంతమంది జిల్లాయేతర కాంట్రాక్టర్లు స్థానిక కాంట్రాక్టర్లకు తెలియకుండా టెండర్లు దాఖలు చేసినట్టు తెలుస్తుండగా, టెండర్లు విప్పితేనే అసలు విషయం బయటకు వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 17 : శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) పరిధిలో రూ.7 కోట్లతో 55 పనులు చేపట్టాలని నిర్ణయించి టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. అందులో 35 పనులు కార్పొరేషన్ బయట అంటే సుడా పరిధిలో ఉండగా.. మిగిలిన పనులు కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. భారీ మొత్తంలో టెండర్లు పిలువడంతో సిండికేట్ కావడానికి ముందు నుంచీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈ వ్యవహారంపై ఈ నెల 17న ‘సుడా టెండర్లలో రింగ్’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం కలకలం రేపింది. నిజానికి ఈ కథనం ఇటు సుడా.. అటు కార్పొరేషన్ పరిధిలో దుమారం రేపగా, ఉన్నతాధికారులు ఆరా తీసినట్టు తెలుస్తున్నది.
కాగా, ఒక పక్కా వ్యూహం ప్రకారం ఈ పనుల్లో రింగ్ అయినట్టు తెలిసింది. అందుకోసం మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కొందరు నేతల కనుసన్నల్లో కాంట్రాక్టర్లు మంతనాలు చేసినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. కార్పొరేషన్ బయట పిలిచిన 35 పనులకు తాము చెప్పిన వారు మాత్రమే టెండర్లు వేయాలని సదరు నేతలు కండిషన్ పెట్టినట్టు తెలుస్తున్నది. ఆ మేరకు సదరు కాంట్రాక్టర్లు ఒప్పుకున్నట్టు సమాచారం. ఇలా ఇచ్చిన పనులకు గాను ఒక్కో పని అంచనా విలువపై రూ.15 శాతం కమీషన్ ఇవ్వడానికి సైతం ఒప్పందాలు జరిగినట్టు తెలుస్తున్నది. అలాగే ఈ పనులు మళ్లీ రద్దు కాకుండా ఉండాలంటే.. కాంట్రాక్టర్ వేర్వేరు పేర్లపై రెండు టెండర్లు దాఖలు చేసే విధంగా కూడా ప్లాన్ చేసిట్టు తెలిసింది.
టెండర్ రద్దు కాకుండా ఉంటే సదరు నేతలకు రూ.15శాతం కమీషన్ రావడానికి ఆస్కారం ఉంటుందని భావించి, ఒక టెండర్‌కు బదులుగా రెండు టెండర్లు వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఇది ఇలా ఉండగా.. కార్పొరేషన్ పరిధిలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఎవరైనా సరే, సదరు నేతలకు 5 శాతం కమీషన్ ఇవ్వాలని ఒప్పందం కూడా చేసుకున్నట్టు సమాచారం. ఇవే కాకుండా.. టెండర్లు వేసే ఒక్కో కాంట్రాక్టర్ నుంచి ఓ కాంట్రాక్టు అసోసియేషన్ ముందస్తుగా రూ.50వేలు వసూలు చేసినట్టు తెలిసింది. ఈ డబ్బులను వివిధ వ్యక్తులకు పంపిణీ చేస్తామని అసోసియేషన్ చెప్పిందని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు.
టెండర్లను దక్కించుకోవాలని జిల్లాయేతర కాంట్రాక్టర్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. స్థానిక కాంట్రాక్టర్లు ఒక్కటి కావడం, కమీషన్లు మాట్లాడుకోవడం, అసోసియేషన్ పేరుతో పగిడీలు వసూలు చేయడం వంటి అంశాలను సీరియస్‌గా తీసుకొని ఇద్దరు ముగ్గురు రహస్య టెండర్లు దాఖలు చేసినట్టు తెలిసింది. చివరి వరకూ వీరిని అడ్డుకునేందుకు కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తున్నది. అయితే ఆ నాయకులతో టెండర్లు వేయమని చెప్పిన సదరు కాంట్రాక్టర్లు.. చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారని కొంతమంది చెబుతున్నారు. ఆ మేరకు టెండర్లు కూడా దాఖలు చేశారని పేర్కొంటున్నారు. అయితే నాయకులను కాదని ఇక్కడ పనులు చేస్తే ఇబ్బందులుంటాయన్న భయంతో సదరు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసి ఉండకపోవచ్చన్న అభిప్రాయాన్ని సైతం వేరే కాంట్రాక్టు అసోసియేషన్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
టెండర్లు విప్పితే తప్పా అసలు విషయం బయటకు రాదని అభిప్రాయపడుతున్నారు. దీంతో రింగ్ సక్సెస్ అవుతుందా.. లేదా బెడసి కొడుతుందా..? అన్న ఉత్కంఠ కూడా ప్రస్తుతం నెలకొన్నది. ఇది ఇలా ఉంటే సిండికేట్ విధానంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకంగా నిలువాల్సిన నాయకులే… కాంట్రాక్టర్లను ఒప్పించి సిండికేట్‌గా మార్చుతూ కమీషన్లు మాట్లాడుకోవడం వల్ల సర్కారు సొమ్ముకు గండి పడుతుందన్న విమర్శలు వస్తున్నాయి.
నిజానికి ప్రతి టెండర్ పోటాపోటీగా జరిగి లెస్‌కు పోయి ఉంటే.. తక్కువలో తక్కువగా 15 శాతం వరకు లెస్వేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కానీ, ఇప్పుడు కొంతమంది తమ ప్రయోజనాల కోసం.. డబ్బులు దండుకోవడం కోసం చేస్తున్న తప్పుడు పనుల వల్ల సర్కారు సొమ్ముకు గండిపడడమే కాకుండా.. పగిడీల పంపకాలు, కమీషన్ల వసూళ్లు అనే దుష్ట సంప్రదాయానికి నాంది పలుకుతాయన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం టెండర్లు విప్పితే అసలు బాగోతం బయటకు వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యూహాత్మకంగా సిండికేట్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయా.. లేక ఇతరులెవ్వరైనా టెండర్లు వేశారా..? అన్నది బహిర్గతం కానున్నది.