వీర్నపల్లి, మార్చి 9: వీర్నపల్లి మండలంలో సాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. బోర్లు, బావులు అడుగంటడంతో పంటలు ఎండిపోతున్నాయి. పదకొండేళ్ల క్రితం నాటి రోజులు మళ్లీ పునరావృతమవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పుష్కలమైన నీటితో పసిడి పంటలు పండించిన రైతులు, కాంగ్రెస్ పాలనలో కన్నీరు పెడుతున్నారు.
యాసంగి మొదట్లో చెరువులు, కుంటల్లో నీరు ఉండడంతో దండిగా వరి సాగు చేశారు. అయితే చెరువుల్లో నీరు లేక, కాలువల్లో రాక, బోర్లు, బావులు అడుగంటిపోయాయి. పొట్ట దశలో పంటలు ఎండిపోతుండడంతో కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అక్కడక్కడా ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నారు. కొందరూ అప్పులు చేసి బోర్లు వేస్తున్నా ప్రయోజనం ఉండడం లేకపోవడంతో రైతన్న కంటతడి పెడుతున్నారు. మండలంలోని వన్పల్లి, రంగంపేట, బాబాయిచెరువుతండా, వన్పల్లిలో సుమారు 40ఎకరాలు ఎండిపోవడంతో చేసేదేం లేక పశువులకు మేతగా వదిలేస్తున్నారు.
మూడెకరాల్లో వరి వేసిన. ఉన్న రెండు బోర్లు వట్టిపోవడంతో నీళ్లు సరిగా వొస్తలేవు. పంట ఎండిపోతంది. ఏం చేయాల్లో అర్థమైతలేదు. చానా బాధైతంది. అప్పు జేసి మొన్న ఇంకో రెండు బోర్లు వేస్తే సుక్కనీరు రాలే. ఎకరం భూమి నీళ్లు లేక నెర్రలు వారింది. ఏం చేయాలో తెల్వక పంటను గొర్ల మేతకు వదిలి పెట్టిన. బోర్లలోంచి అచ్చే తడితో మిగిలిన రెండెకరాలు ఎల్లదీద్దమనుకుంటే పారుతలేదు. పెట్టుబడైనా అస్తదో రాదో. తెచ్చిన అప్పులెట్లా కట్టాల్నో తెలుస్తలేదు.
– లాకవత్ లక్ష్మి, రైతు, రంగంపేట