వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భద్రపరిచిన రికార్డులకు చెదలు పట్టింది. సబ్‌రిజిస్ట్రార్ ఈ నెల ఒకటిన బదిలీ కాగా, కరీంనగర్ డీఐజీ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్‌ను ప్రభుత్వం ఇన్చార్జిగా నియమించింది. రికార్డు గదిని పరిశీలించిన సదరు అధికారి.. డాక్యుమెంట్లు సక్రమంగా లేకపోవడం, వాటికి చెదలుపట్టి ఉండడాన్ని గమనించి ఇక్కడ బాధ్యతలు తీసుకునేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. సెలవుల పేరుతో ఆయన కాలయాపన చేస్తుండడం విమర్శలకు తావిస్తున్నది.
వేములవాడ, ఆగస్టు 28 : వేములవాడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం 1982లో ప్రారంభమైంది. అప్పటి నుంచి మాన్యువల్ పద్ధతిలోని రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగింది. 2000 తర్వాత కంప్యూటర్ సేవలు అందుబాటులోకి రాగా, ప్రతి రికార్డును డిజిటల్ రూపంలో భద్రపర్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. 2000కి ముందు 18ఏండ్ల కాలపరిధిలో జరిగిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను కాగితాల రూపంలో రికార్డుగదిలో భద్రపరిచారు. ప్రస్తుతం ఆ రికార్డుల ప్రక్రియ సక్రమంగా లేదని, వాటిలో కొన్నింటికి చెదలు పట్టినట్లు తెలిసింది.
రికార్డులే కీలకం
కార్యాలయంలో ప్రతి రికార్డును భద్రపరిచే బాధ్యత సబ్‌రిజిస్ట్రార్‌పై ఉంటుంది. భవిష్యత్తులో కొనుగోలుదారులు, అమ్మకందారులకు ఎదురయ్యే సమస్యలకు రికార్డులు కీలకం. అయితే వేములవాడలో ఏడాదికి 10వేలకు పైగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కార్యాలయంలోని రికార్డులు సక్రమంగా లేకపోవడం, కొన్నింటికి చెదలు పట్టడంతో వేములవాడలో బాధ్యతలు తీసుకునేందుకు వచ్చిన సదరు అధికారి.. సెలవు పేరుతో కాలయాపన చేస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో బుధవారం వేములవాడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కరీంనగర్ డీఐజీ రవీందర్ తనిఖీ చేశారు.
13 కార్యాలయాలకు.. ఏడుగురు ఇన్‌చార్జిలే
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సబ్రిస్ట్రార్ల బదిలీలు జరిగాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉండగా, ఏడు కార్యాలయాల్లో ఇన్చార్జిలతో కాలంవెల్లదీస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం
వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డులకు చెదలు పట్టిన విషయం నా దృష్టికి రాలేదు. రికార్డుల ప్రక్రియ సరిగ్గా లేకపోయినా.. చెదలు పట్టినా.. సదరు అధికారిపై చర్యలు తీసుకుంటాం. మరో 20రోజుల్లో పూర్తిస్థాయిలో సబ్‌రిజిస్ట్రార్‌ను వేములవాడకు కేటాయిస్తాం.
– రవీందర్, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ (కరీంనగర్)