కలెక్టరేట్, మార్చి 20 : నగరంలో భూకబ్జాదారుల ఆగడాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు. ప్రభుత్వ ఆస్థులు ధ్వంసం చేస్తూ, వాటికి దర్జాగా దారులు ఏర్పాటు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆక్రమణలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా పట్టింపులేనట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారని పట్టేదారులు మండిపడుతున్నారు. నగర శివారులోని ఆటోనగర్ ప్రాంతంలో బైపాస్ రోడ్డును ఆనుకుని ఉన్న సర్వేనెం.622లో కొంత భూమిని కబ్జా పెట్టిన ఓ వ్యక్తి రాష్ట్ర రహదారికి రక్షణగా ఉన్న ఐరన్ రెయిలింగ్ ధ్వంసం చేసి, కబ్జా స్థలానికి దారి ఏర్పాటు చేసుకున్నాడు.
ఇదేంటని ప్రశ్నిస్తే తమపైనే భౌతిక దాడులకు పాల్పడుతున్నట్లు పట్టేదారు తీపిరెడ్డి లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి రెయిలింగ్ ధ్వంసంపై ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. రెయిలింగ్ ధ్వంసంతో నగరంలోని చెత్త చెదారాన్ని, హాస్పిటల్స్ వ్యర్ధాన్ని ట్రాక్టర్లలో తెచ్చి తమ స్థలంలో వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతుల్లేకుండా ప్రభుత్వ ఆస్థి ధ్వంసం చేసిన సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.