వేములవాడ/ సిరిసిల్ల టౌన్, మార్చి 18: బీఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వ నిర్బంధం కొనసాగుతున్నది. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తున్న వారి గొంతులను నొక్కేస్తున్నది. ఉస్మానియా యూనివర్సిటీలో సభలు, సమావేశాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మంగళవారం అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. వేకువ జామున ఎక్కడ దొరికితే అక్కడ అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్లను తరలించారు.
ఈ సంద ర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ అనేక ప్రజా ఉద్యమాలకు వేదికైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిరసన కార్యక్రమాలపై ఆంక్షలు విధించడం సీఎం రేవంత్ రెడ్డి నియంత పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి దొడ్డిదారిన రావచ్చు కానీ, ఓయూ విద్యార్థులు నిరుద్యోగ సమస్యల ప్రశ్నిస్తే తప్పేంటని ప్రశ్నించారు. విద్యాశాఖను తన దగ్గర పెట్టుకుని విశ్వవిద్యాలయాల స్యయంప్రతిపత్తిని రద్దు చేయాలని చేస్తున్న కుట్రలు మానాలని డిమాండ్ చేశారు. 100 సంవత్సరాల చరిత్ర గల ఉస్మానియాలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా నిర్బంధాలను కొనసాగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సర్క్యులర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.