JNTU | రామగిరి, జనవరి 16 : మంథని జేఎన్టీయూ లో అసిస్టెంట్ ప్రొపెసర్, ప్రముఖ అంతర్జాతీయ త్రీడీ ఆర్టిస్ట్ ఎస్ఎస్ఆర్. కృష్ణకు అమెరికా నుంచి అరుదైన గౌరవం దక్కింది. ప్రతీ సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే లేక్ వర్త్ బీచ్ స్ట్రీట్ పెయింటింగ్ ఫెస్టివల్లో ఫీచర్డ్ ఆర్టిస్ట్‌గా పాల్గొనాలని నిర్వాహకులు ఆయనకు ఆహ్వానం పంపించారు. ఈ వేడుక ఫ్లోరిడా రాష్ట్రంలోని లేక్ వర్త్ బీచ్ నగరంలో ఫిబ్రవరి 21, 22 తేదీల్లో జరగనుంది. ఈ అంతర్జాతీయ కళా ఉత్సవంలో దేశం తరఫున ఒక్కరే ఎంపిక కావడం విశేషం.
ఈ అవకాశంతో భారతదేశ ప్రతిష్ఠను అంతర్జాతీయ వేదికపై చాటే అవకాశం లభించిందని కళా వర్గాలు ప్రశంసిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎస్.ఎస్.ఆర్. కృష్ణ మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఎంతో గర్వకారణమని తెలిపారు. నిర్వాహకులు తన కళను గుర్తించి ఫీచర్డ్ ఆర్టిస్ట్‌గా ఆహ్వానించడం ఆనందంగా ఉందన్నారు. అంతేకాకుండా, మన దేశంలో త్రీడీ ఆర్ట్‌కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ కళా రంగంలో భారతీయ త్రీడీ ఆర్ట్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో కృష్ణ పాత్ర అభినందనీయమని కళాభిమానులు అభిప్రాయపడుతున్నారు.