రూ.50 కోట్ల టెండర్ల రద్దుపై కరీంనగర్ బల్దియా భగ్గుమంటున్నది. నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారన్న విమర్శలు వస్తుండడం రాజకీయ పార్టీల మధ్య ప్రకంపనలు సృష్టిస్తున్నది. అలాగే.. బీజేపీ, కాంగ్రెస్‌లో వర్గ విభేదాలకు ఈ విషయం ప్రస్తుతం వేదికైంది. ఇదే సమయంలో పార్టీలకు అతీతంగా విలీన గ్రామాల కార్పొరేటర్లు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవ్వడంతో వివాదం మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తున్నది. ఇది ఇలా ఉంటే.. ఈ వ్యవహారంపై శనివారం ముఖ్యమంత్రి వరకు ఫిర్యాదుల పరంపర కొనసాగింది. అక్కడితో ఆగకుండా టెండర్ల రద్దును నిలిపివేసి యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. పలువురు బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు కలెక్టర్, కమిషనర్‌కు లిఖిత పూర్వకంగా వినతులు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.
కరీంనగర్, మార్చి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (యూఐడీఫ్) కింద వచ్చిన రూ.50 కోట్ల నిధులతో 87 పనులు చేపట్టేందుకు టెండర్ ప్రక్రియ నిర్వహించారు. ఈ నిధుల ద్వారా చేపట్టే పనులకు ముందుగా ఎస్టిమేషన్ తయారీ బాధ్యతలను ఓ సంస్థకు అప్పగించారు. ఆ మేరకు ఎంపిక చేసిన పనుల్లో ఏవి అర్హత గలవో గుర్తించి, సదరు సంస్థ వాటికి యుద్ధమేఘాల మీద ఎస్టిమేషన్ తయారు చేసి ఇచ్చింది. వీటి ఆధారంగా మిగిలిన అన్ని ప్రక్రియలు కొనసాగాయి. ఎస్టిమేషన్ తయారు చేసినందుకు దాదాపు రూ.30 లక్షలు చెల్లించాలని సదరు సంస్థ నిర్వాహకులు కార్పొరేషన్‌కు బిల్లులు సమర్పించినట్టు తెలుస్తున్నది.
అయితే, ప్రస్తుతం పరిపాలనా సౌలభ్యం (అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్) దృష్ట్యా టెండర్లు రద్దు చేశారని అధికారులు చెబుతున్నారు. అదే నిజమైతే పనులు రద్దు చేయడానికి ఎస్టిమేషన్లో ఏమైనా లోపం ఉందా.. లేదా..? అన్న విషయాన్ని వెల్లడించాలి. అలాగే, ఎస్టిమేషన్ తయారు చేయడం.. సీడీఎంఏ అనుమతి ఇవ్వడం.. ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాత పిలిచిన టెండర్లను ఇప్పుడు అడ్మిస్ట్రేషన్ గ్రౌండ్ పేరిట ఎలా రద్దు చేస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక వేళ వీటిని రద్దు చేస్తే ఎస్టిమేషన్ తయారు చేసిన సంస్థకు రూ.30 లక్షల బిల్లులు ఎవరు ఇస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విషయంలో ఈరోజు వరకు అధికారులు ఓ క్లారిటీ ఇవ్వలేదు. అయితే, టెండర్ల రద్దుతో సంబంధం లేకుండా నిబంధనల ప్రకారం ఎస్టిమేషన్ తయారు చేసిన సంస్థకు బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని ఓ అధికారి పేర్కొన్నారు. అదే నిజమైతే.. టెండర్ల రద్దు అంశాన్ని కొద్దిసేపు పక్కన పెడితే రూ.30 లక్షల ప్రజాధనం వృథా అయినట్టే అన్న ప్రశ్నలకు అధికారులే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తున్నది.
ఫిర్యాదుల పరంపర
రూ.50 కోట్ల టెండర్ల రద్దు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. టెండర్ల రద్దు విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన కొంత మంది కార్పొరేటర్లు సమర్థిస్తుండగా.. ఇదే పార్టీలకు చెందిన పలువురు కార్పొరేటర్లు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అక్కడితో ఆగకుండా టెండర్లను యధావిధిగా కొనసాగించి తీరాలని డిమాండ్ చేయడంతోపాటు పార్టీ నుంచి బయటకొచ్చి ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కమిషనర్ నుంచి ముఖ్యమంత్రి వరకు ఈ ఫిర్యాదుల పరంపర శనివారం వరకు కొనసాగింది.
టెండర్లను రద్దు చేయకుండా యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీకి చెందిన 18వ డివిజన్ కార్పొరేటర్ వాసాల రమేశ్, 17వ డివిజన్ కార్పొరేటర్ వేముల కవిత-చంద్రశేఖర్ శుక్రవారం కలెక్టర్, కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 17, 18 వార్డులో రూ.9 కోట్ల విలువైన 19 పనులు పెట్టారని, వీటిని రద్దు చేస్తే ప్రజలు అడిగే ప్రశ్నలకు తాము సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంటుందని, ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని, విషయాన్ని పరిశీలించి టెండర్లను యధావిధిగా కొనసాగించాలని సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు.
సదరు ఫిర్యాదులను సీడీఎంఏతోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పంపించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీకి చెందిన 16వ డివిజన్ కార్పొరేటర్ సైతం ఇదే విషయాన్ని వివరిస్తూ ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా విన్నవించారు. జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పిట్టల రవీందర్ టెండర్లను రద్దు చేయవద్దని కోరుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు రద్దు చేసిన విషయంపై తక్షణం విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టెండర్లను రద్దు చేయడాన్ని నిరసిస్తూ శనివారం సీపీఐ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నాయకులు ధర్నా చేశారు.
పార్టీలో విభేదాలు.. కొత్త డ్రామాలు
రూ.50 కోట్ల టెండర్లను రద్దు చేయడంతో విలీన గ్రామాల కార్పొరేటర్లు భగ్గుమంటున్నారు. అంతేకాదు, అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధమవుతామని ప్రకటిస్తున్నారు. తాజా, మున్సిపల్ ఎన్నికల్లో ఈ పనుల మంజూరు పత్రాలను చూపించి విజయం సాధించామని, తీరా ఇప్పుడు వీటిని రద్దు చేస్తే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. టెండర్ల రద్దు వివాదం ప్రస్తుతం బల్దియాను షేక్ చేస్తున్నది. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయన్న విమర్శలు వస్తున్నాయి.
అలాగే, టెండర్ల రద్దు విషయంలో కొంత మంది బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు చొరవ చూపగా.. ఈ విధానాన్ని రెండు పార్టీలకు చెందిన మరికొంత మంది కార్పొరేటర్లు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆయా పార్టీలో వర్గ విభేదాలు పొడచూపిన విషయం స్పష్టమవుతున్నది. ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా విలీన గ్రామాలకు చెందిన కార్పొరేటర్లు పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఏ పరిస్థితుల్లోనూ టెండర్లు రద్దు కాకుండా చూడాలని వారంతా ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం. అందులో భాగంగానే కొంత మంది కార్పొరేటర్లు బాహాటంగా ముందుకొచ్చి అధికారులకు వినతులు, ఫిర్యాదులు చేస్తుండగా మరికొంత మంది కూడా వీరితో కలిసి రావడానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
ఈ విషయం రోజుకో మలుపు తిరుగుతుండడం, టెండర్ల రద్దుపై తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగడం, పార్టీల్లో విభేదాలు పొడచూపడం వంటి పరిణామాల నేపథ్యంలో కొంత మంది కార్పొరేటర్లు కొత్త డ్రామాను మొదలు పెట్టినట్టు తెలుస్తున్నది. డివిజన్‌కు రూ.50 లక్షలు కేటాయించేలా ప్లాన్ చేశామంటూ అందుకోసం సంతకాలు చేయాలని పేర్కొంటూ బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన పలువురు కార్పొరేటర్లు సంతకాల సేకరణ చేస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో రూ.50 కోట్ల టెండర్లు రద్దు చేస్తేనే ఇది సాధ్యమవుతుందని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
నిజానికి పనుల కోసం సంతకాల సేకరణే అవసరం లేదు. కౌన్సిల్లో తీర్మానం చేస్తే సరిపోతుంది. కానీ, సంతకాల సేకరణ ఎందుకు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నిజానికి టెండర్ల రద్దు అనేది సహేతుకం కాదన్న విషయం అధికారులకు తెలిసినా రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకొని సదరు అధికారులు ఇప్పుడు వివాదంలో ఇరుక్కున్నారన్న చర్చ కూడా కొనసాగుతున్నది. మరోవైపు కొంత మంది కార్పొరేటర్లు న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీలో మరిన్ని విభేదాలు తలెత్తుతాయన్న భయం ప్రస్తుతం పార్టీలను వెంటాడుతున్నది. ఈ వవ్యవహారం రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువు కావడంతో రాజకీయ ఒత్తిళ్ల మధ్య అధికారులు నలుగుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Karimnagar
కమీషన్ల కోసమే టెండర్ల రద్దు
కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 28 : కరీంనగర్ నగర పాలక సంస్థ ఎన్నికలకు ముందు విలీన గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం రూ.50 కోట్లు మంజూరు చేసి, టెండర్లు కూడా పిలిచిందని, వాటిని ఓపెన్ చేయకుండానే కమీషన్ల కోసమే రాష్ట్ర ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా రద్దు చేసిందని సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు ఆరోపించారు. శనివారం సంస్థ కార్యాలయం వద్ద రద్దయిన టెండర్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో మంజూరైన నిధులతో దాదాపు 87 అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఎన్నికలకు ముందే టెండర్లు పిలిచారని, కానీ కొత్తగా ఏర్పడ్డ అధికార పాలకవర్గం కమీషన్ల కోసం వీటిని అడ్డుకోవడం సరికాదని హితవుపలికారు. కమీషన్లపై ఉన్న శ్రద్ధ గ్రామాల అభివృద్ధి విషయంలో అధికార పార్టీలకు లేకుండా పోయిందని దుయ్యబట్టారు. ధర్నాలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్, నగర కార్యవర్గ సభ్యులు మామిడిపల్లి హేమంత్, బాకం అంజన్న, కండె అజయ్, మార శ్రీనివాస్ గౌడ్, రమేశ్, ఎల్లయ్య, రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.