Ramagiri | రామగిరి, ఏప్రిల్ 18 : ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను రామగిరి పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ ఎం రమేష్ తెలిపారు. పోలీసుల సమాచారం మేరకు, ఎస్సై శ్రీనివాస్ సిబ్బందితో కలిసి శనివారం ఉదయం కల్వచర్ల శివారులో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు గతంలో రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు.
అరెస్టయినవారిలో దాసరి రవి (40), వనం పాపయ్య (31), వనం నగేష్ (30) ఉన్నారు. వీరు పగలు ఇళ్లను రెక్కీ చేసి, రాత్రి తాళాలు పగులగొట్టి బంగారం, నగదు దొంగిలించేవారని పోలీసులు తెలిపారు. వారి నుంచి హుందాయి కారు, సెప్టిక్ ట్యాంకర్, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. గతంలో కల్వచర్ల, ఓడెడు, ముత్తారం, రత్నపూర్ ప్రాంతాల్లో పలు దొంగతనాలు చేసినట్లు వెల్లడైంది. ప్రజలు ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరచడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఏసీపీ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.