Inter Exams | పెద్దపల్లి , ఫిబ్రవరి23 : పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఇంటర్ పరీక్షల నిర్వహణపై అదనపు కలెక్టర్లు జెల్ద అరుణశ్రీ, దాసరి వేణుతో కలిసి కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. 25 నుంచి మార్చి 18 వరకు జరిగే ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు.
జిల్లాలో జనరల్, వోకేషనల్ కలిపి మొత్తం 10,367 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారని, వీరి కోసం 22 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రానికి 100 మీటర్ల వరకు ఎటువంటి పార్కింగ్ ఉండోద్దని స్పష్టం చేశారు. విద్యార్థులు పరీక్షకు సకాలంలో హాజరయ్యేందుకు అనుకూలంగా ఆర్టీసీ బస్సులు పరీక్షా కేంద్రాల రూట్లలో స్పెషల్ బస్సులు నడపాలని సూచించారు.
పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి కల్పన, పెద్దపల్లి, మంథని ఆర్డీవోలు గంగయ్య, సురేష్, ఏసీపీ జి. కృష్ణ, కలెక్టరేట్ ఏవో బండి ప్రకాష్, మున్సిపల్ కమిషనర్లు ఆకుల వెంకటేష్, రమేష్, సంబంధిత అధికారులు, చీఫ్ సూపరెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.