మంథని రూరల్, ఆగస్టు 31 : పంటలకు ఇన్సూరెన్స్ చేయిస్తామని, మంచి గిట్టుబాటు ధర కల్పిస్తామని ఎన్నికల ముందు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక నట్టేట ముంచిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. రైతు డిక్లరేషన్ ఏమైందని, ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఆదివారం మంథని మండలం పోతారం, విలోచరం గ్రామాల్లో గోదావరి నది వరద ఉధృతికి మునిగిన పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ పంటలన్నీ వరదపాలయ్యాయని గోడు వెల్లబోసుకున్నారు. అనంతరం పుట్ట మధూకర్ మాట్లాడారు. విలోచవరం, పోతారం గ్రామాల్లోని వందల ఎకరాల పంటలు ఐదు రోజులుగా మునిగి కుళ్లిపోయాయన్నారు. ప్రభు త్వం వెంటనే సర్వే చేయించి నష్టపోయిన పంటలకు ఎకరాకు 25వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ ప్రాంత ప్రజలు, రైతుల ఓట్లతో పెద్ద పదవి పొందిన మంథని ఎమ్మెల్యేకు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత లేదా..? అని ప్రశ్నించారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఓట్ల కోసం రైతులను నమ్మించి, అధికారంలోకి వచ్చాక మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా రైతుల గురించి ఆలోచన చేసి ప్రాజెక్టుల గేట్లు దించి భూగర్భజలాలు పెరిగేలా చూడాలని, ఈ ప్రాంతంలోని ముదిరాజ్‌లు, మత్స్య సంపదతో ఉపాధి పెరిగేలా సాగుకు నీరందేలా చేయాలని సూచించారు. ప్రజలు, రైతుల పక్షాన పోరాటం చేస్తుంటే పోలీసులతో అణిచివేయాలని భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తే భయపడేది లేదని తేల్చిచెప్పారు. ఈ మట్టిపై పుట్టిన బిడ్డగా ఎప్పుడూ ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తానని హమీ ఇచ్చారు. ఇక్కడ నాయకులు ఏగోళపు శంకర్ గౌడ్, తగరం శంకర్‌లాల్, కనవేన శ్రీనివాస్‌యాదవ్, బండ రవి, పోగుల సదానందం, తిరుపతి,కొండ రవీందర్, పెగడ శ్రీనివాస్, కా రేంగుల సురేశ్, పుప్పాల తిరుపతి, కాయితి సమ్మయ్య, రైతులు ఉన్నారు.