Jagityal | జగిత్యాల, జులై 19 : వయో వృద్ధులను నిరాధరిస్తున్న కుమారులపై వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద చర్యలకు జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ అదేశాల మేరకు శనివారం ఆర్డీవో కార్యాలయంలో ఏవో రవికాంత్ విచారణ నిర్వహించారు.
గొల్లపల్లి మండలం వెంగళాపూర్ గ్రామానికి చెందిన సింగం లక్ష్మీ, అదే మండలానికి చెందిన నందిపల్లె గ్రామానికి చెందిన పుప్పాల రామవ్వ, జగిత్యాల పట్టణంలోని వంజరివాడకు చెందిన తుదుగేని శారద, మంచినీళ్ల బావి వాడకు చెందిన రాయిల్ల మల్లయ్య తదితర ఫిర్యాదు దారులను విచారించారు.
విచారణలకు ముందుగా వృద్ధులైన తల్లిదండ్రులను పోషించకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారి కుమారులు, కోడళ్లు, కూతుర్లకు 2007 సంరక్షణ చట్టం, నియమావళి 2011, సెక్షన్ 24పై సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ విచారణలో తెలంగాణ అల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, వృద్ధుల సంరక్షణ విభాగం సహాయకురాలు పద్మజ, తదితరులు పాల్గొన్నారు.