Munnur Kapu | కోరుట్ల, జూన్ 16: పట్టణంలో సోమవారం మున్నూరు కాపు సంఘం నాయకులు బైక్ ర్యాలీ తీశారు. ఈసందర్భంగా రాష్ట్ర మంత్రివర్గంలో మున్నూరు కాపులకు అన్యాయం జరిగింది అని ఆరోపిస్తూ, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతూ కోరుట్లలోని వేములవాడ రోడ్డు హనుమాన్ దేవాలయం నుంచి, నంది చౌక్, గాంధీ రోడ్డు, వెంకటేశ్వర స్వామి దేవాలయం, గడి బురుజు, డైమండ్ హోటల్, కొత్త బస్టాండ్ జాతీయ రహదారి మీదుగా కార్గిల్ చౌక్, నంది చౌక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో మున్నూరు కాపులకు చోటు కల్పించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం పునరాలోచించి వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు చెదలు సత్యనారాయణ, మున్నూరు కాపు సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.