SSC board mistake | రామగిరి, జూన్ 5: పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనంలో బోర్డు అధికారుల తప్పిదంతో ఓ విద్యార్థినికి అన్యాయం జరిగిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు..రెండు కాదు… ఏకంగా 20 మార్కులను ఆ విద్యార్థిని కోల్పోయిన ఉదంతం రీ కౌంటింగ్లో బయటపడింది. బాధిత విద్యార్థి బంధువుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన వర్షిత అనే విద్యార్థిని సెంటినరీకాలనీలోని వాణీ సెకండరీ పాఠశాలలో పదో తరగతి చదివింది.
గత ఏప్రిల్ 30న పదో తరగతి వార్షిక పరీక్షలో 567/600 మార్కులు తెచ్చుకుంది. చదువులో ఫస్ట్ ఉండే వర్షితకు మార్కులు సంతృప్తి కలిగించలేదు. తెలుగు పార్ట్-బీ పేపరు 20 మార్కులు జమ చేయకుండా 567 మార్కులు వేసినట్లు అనుమానం వచ్చి బోర్డు అధికారులకు రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నది. దాంతో బోర్డు ఆదేశాలతో మూల్యంకనంను మరోసారి పరిశీలించగా అసలు తప్పిదం బయటపడింది. పార్ట్-బీ పేపర్ కౌంట్ చేయలేదని గుర్తించి ఇప్పుడు 20 మార్కులు కలిపి మొత్తం 587 మార్కులుగా బోర్డు నుంచి మార్కుల మెమోను పంపించారు.
దీంతో వర్షిత జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సొంతం చేసుకుంది. ఒకవేళ రీ కౌంటింగ్ కు దరఖాస్తు చేసుకోకపోతే తాను జిల్లా టాపర్ ర్యాంకు కోల్పోయి ఉండేదాన్ని అని వర్షిత ఆవేదన వ్యక్తం చేసింది. ఈమేరకు గురువారం పాఠశాల చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పీఈటీ తిరుపతి, ఉపాధ్యాయ బృందం వర్షితను అభినందించారు.