Godavarikhani | కోల్ సిటీ, ఆగస్టు 25: రామగుండం నగర పాలక సంస్థలో పని చేస్తున్న చెత్త సేకరణ కార్మికులను అధికారులు పట్టించుకోవాలని ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు ముద్దెల దినేష్ కోరారు. వాటర్ ట్యాంక్ ఆవరణలో సోమవారం జరిగిన కార్మికుల సమావేశంలో వారు మాట్లాడారు. కార్పొరేషన్లో పని చేస్తున్న చెత్త సేకరణ కార్మికులకు కొంత కాలంగా పనిమట్లు సక్రమంగా అందడం లేదనీ, చేతి గౌజ్లు, మాస్కులు, డెటాల్ లోషన్, సబ్బులు, కొబ్బరి నూనె, బెల్లం, చెప్పులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
కనీస వసతులకు నోచుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రతి డివిజన్లో ప్రతి రోజూ ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే కార్మికులతో అదనంగా రోడ్లు ఊడ్చడం, కాలువలు శుభ్రం చేయడం, ఇతర పనులు కూడా అప్పగించి శ్రమ దోపిడికి గురి చేస్తున్నారని వాపోయారు. పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా జీతాలు పెంచడం లేదన్నారు.
సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పును నగర పాలక అధికారులు విస్మరించి కార్మికుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఇప్పటికైనా చెత్తసేకరణ కార్మికులకు చట్టబద్ధంగా రావల్సిన జీతాలు, సౌకర్యాలు కల్పించాలని కోరారు. సమావేశంలో మహిళా కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.