కార్పొరేషన్, ఏప్రిల్ 28: కరీంనగర్ కాంగ్రెస్‌లో కుమ్ములాటలు మరోసారి బహిర్గతం అయ్యాయి. ఏఐసీసీ కార్యదర్శి ముందే ఇరువర్గాలు బాహాబాహికి దిగేందుకు యత్నించాయి. జిల్లాలో కొంతకాలంగా మంత్రి పొన్నం, కరీంనగర్ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్ మధ్య సాగుతున్న వర్గపోరు సోమవారం జరిగిన సమావేశంలో మరోసారి బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం రసాభాసగా మారింది.
ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాళ్లు ఎదురుగానే కాంగ్రెస్‌లోని విబేధాలు బయటపడ్డాయి. ఈ సమావేశంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్ వర్గం, మంత్రి పొన్నం ప్రభాకర్ వర్గీయుల మధ్య వివాదంతో ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో పార్టీ సమావేశంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమావేశం ప్రారంభించిన అనంతరం సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, జిల్లాకు చెందిన ఓ నాయకుడు నియోజకవర్గానికి సంబంధించి ఏ ప్రతిపాదన తాము పంపించినా అడ్డుకున్నారని విమర్శించారు.
గతంలోనూ పార్టీని భ్రస్టు పట్టించారని.. ఇప్పుడు కూడా అదే పని చేస్తుడడంతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అధ్వానంగా మారిందని విమర్శించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు పడాల రాహుల్, చక్రధర్, శ్రీనివాస్ ఒక్కసారి వేదికపైకి దూసుకువచ్చి ఎవరి గురించి అంటున్నారంటూ నిలదీశారు. నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చి టిక్కెట్ పొంది అమ్ముడుపోయిన నువ్వు.. ఏళ్ల తరబడిగా పార్టీ కోసం పని చేస్తున్న వారిని విమర్శించడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొన్నంను పరోక్షంగా విమర్శిస్తున్నారంటూ విమర్శించారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట సాగింది. వేదికపైన అగ్రనేత ముందే ఒకరినొకరు తోసుకున్నారు. ఇరువర్గాలు తీవ్రస్థాయిలో దూషణలు చేసుకున్నాయి. దీంతో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ఇరువర్గాల నాయకులు ఒకరిపైకి ఒకరు దూసుకొచ్చి బాహాబాహికి దిగినంత పనిచేశారు. దీంతో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఇతర నాయకులు ఇరువర్గాలను శాంతింపచేసే ప్రయత్నం చేశారు.
కానీ ఎవరు వెనక్కి తగ్గకపోవడంతో సమావేశం అంతా రసాభాసగా మారింది. వివాదం ముదురుతుండడంతో పురుమల్ల శ్రీనివాస్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం సమావేశం కొనసాగింది. సమావేశం పూర్తయినా తర్వాత కూడా ఇరువర్గాల నాయకుల మధ్య మరోసారి వాగ్వాదం నెలకొన్నది. కాగా, పోలీసులు అక్కడి చేరుకొని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించేశారు.