ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 26: సారూ స్లాబ్ వేసినా ఇప్పటి వరకు ఒకటే బిల్లు వచ్చిందని, ఇంకా రెండు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు కోనేటి రాజవ్వ వాపోయింది. శుక్రవారం సిరిసిల్ల కలెక్టర్ ఎదుట గోడు వెల్లబోసుకున్నది. దశల వారీగా బిల్లులు వస్తాయనే నమ్మకంతో అప్పుతెచ్చి స్లాబ్ వరకు వేస్తే డబ్బులు ఖాతాలో పడడం లేదని ఆవేదన చెందింది. దీంతో అప్పులు ఇచ్చినవాళ్లు అడుగుతున్నారని వాపోయింది. వివరాల్లోకి వెళ్తే.. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా శుక్రవారం ఎల్లారెడ్డిపేటలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు.
ఈ క్రమంలో చెందిన కోనేటి రాజవ్వ ఇంటి నిర్మాణాన్ని పర్యవేక్షించారు. ఇల్లుకు సంబంధించిన వివరాలను కలెక్టర్ అడుగగా, తమకు ఇప్పటి వరకు ఒకేసారి బేస్మిట్ బిల్లు వచ్చిందని, మిగతా రెండు బిల్లులు రాలేదని రాజవ్వ తెలిపింది. దీంతో సోమవారం వరకు మిగతా 2లక్షలు వస్తాయని కలెక్టర్ హామీఇచ్చారు. ఈ విషయమై రాజవ్వ కొడుకు కృష్ణను అడుగగా, ఇల్లుకు సంబంధించి రూఫ్ లెవల్ వరకు బిల్లును ఎండీ అప్రూవ్ చేసినప్పటికీ.. ఈఈ వద్ద పెండింగ్ ఉందని మెసేజ్ రావడంతో అయోమయంలో పడ్డామన్నారు. హౌసింగ్ ఏఈ చైతన్యను వివరణ కోరగా, సోమవారం లేదా మంగళవారం బిల్లులు క్లియర్ చేస్తామని తెలిపారు.