పెగడపల్లి, జూన్ 23: ఇందిరమ్మ ఇండ్ల పథకం లక్ష్యం నీరుగారుతున్నది. అధికారుల నిర్లక్ష్యం.. పట్టింపులేమితో గృహ నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోవాల్సి వస్తున్నది. పెగడపల్లి మండలంలో స్థానికంగా ఎలాంటి ఇసుక రీచ్‌లు లేకపోవడం, ప్రభుత్వం ఉచితంగా ఇసుక పంపిణీ చేయకపోవడంతో నిర్మాణాలకు ఆదిలోనే బ్రేక్ పడుతున్నది. మండలంలో 454 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, ఇప్పటి వరకు కేవలం 195 నిర్మాణాలకు మాత్రమే అధికారులు మార్కవుట్ ఇచ్చారు.
అందులో కొన్ని ఇండ్ల నిర్మాణం మాత్రమే ప్రారంభం కాగా, అవి కూడా పునాదుల్లోనే నిలిచిపోయాయి. ఇసుక లేకుండా నిర్మాణాలు ఎలా చేపట్టాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. అలాగే బేస్మెంట్ దాకా నిర్మించుకున్న ఇండ్లకు తొలి విడత రూ.లక్ష బిల్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా, అధికారులు ఇవ్వడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక, బిల్లుల సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, ఈ విషయమై గృహ నిర్మాణ శాఖ ఏఈ శ్రీకాంత్‌ను వివరణ కోరగా, మండలంలో ఉచిత ఇసుక పంపిణీపై తమకు ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. సాంకేతిక సమస్య వల్ల కొందరికి బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందని వివరించారు.