Kalvacherla | రామగిరి, ఏప్రిల్ 14 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కల్వచర్ల గ్రామంలో వివాదాస్పద పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో ఇప్పటికే ఇళ్లు ఉన్నవారికే ఈ పథకం కింద ఇళ్లు మంజూరు చేస్తున్నారని, నిజంగా ఇల్లు లేని పేదలకు మాత్రం అవకాశాలు కల్పించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన పలువురు అర్హులైన కుటుంబాలు తమకు ఇల్లు లేకపోయినా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా జాబితాలో చోటు దక్కలేదని వాపోతున్నారు.
మరోవైపు, ఇప్పటికే స్వంత ఇళ్లు ఉన్న కొందరు లబ్ధిదారులుగా ఎంపిక కావడం అన్యాయమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులను సంప్రదించినప్పటికీ స్పష్టమైన సమాధానం లభించలేదని గ్రామ ప్రజలు తెలిపారు. నిజంగా అర్హులైన వారికి న్యాయం చేయాలని, జాబితాను పునఃసమీక్షించాలని వారు కోరుతున్నారు.