స్వాతంత్య్ర వజ్రోత్సవ ఖ్యాతి దశదిశలా వ్యాపించేలా శుక్రవారం పలు కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఒకవైపు రాఖీ పండుగను జరుపుకొంటూనే మరోవైపు జాతీయభావాన్ని చాటారు. పలు చోట్ల సామూహిక రక్షా బంధన్ కార్యక్రమాలు నిర్వహిస్తూనే జాతీయ జెండాలు పంపిణీ చేశారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. ఊరూ, వాడా జాతీయ జెండాలు పట్టుకొని ర్యాలీలతో హోరెత్తించారు. కరీంనగర్లో జరిగిన వేడుకలకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హాజరవగా, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కరీంనగర్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర వజ్రోత్సవ కార్యక్రమాలు వైభవం గా కొనసాగుతున్నాయి. ఐదో రోజైన శుక్రవారం జాతీయ భావం దశ దిశలా వ్యాపించేలా జెండాలతో ర్యాలీలతో హోరెత్తించారు. ఇంటింటికీ త్రి వర్ణ పతాకాలు పంపిణీ చేసి దేశభక్తిని చాటారు. కరీంనగర్‌లోని శ్రీహరినగర్‌లో మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ఇంటింటికీ తిరిగి జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మ హిళలు మంత్రి, మేయర్, ముస్లింలకు రాఖీలు కట్టి తమ సోదరి భావాన్ని చాటారు. హుజూరాబాద్‌లో విద్యార్థులు ర్యాలీ తీశారు. గంగాధర మండలం మధురానగర్‌లో త్రివర్ణ పతాకాలు చేతబూని, బాడ్జీలు ధరించిన విద్యార్థులు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు రాఖీలు కట్టారు. వేములవాడలో ముస్లిం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తిరంగ్ జెండా ర్యాలీ తీశారు. జగిత్యాల జిల్లా రాయికల్ మ సీద్ వద్ద ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ముస్లింలకు జెండాలు పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్జీ-1, యైటింక్లయిన్‌కాలనీలో జాతీయ పతాకాలతో భారీ ర్యాలీలు తీశారు.
నేడు ఫ్రీడం ర్యాలీలు..
వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఫ్రీడం ర్యాలీలు నిర్వహించనున్నారు. ఆనాటి అమరవీరుల ఆత్మబలిదానాలను స్మరిస్తూ నిర్వహించే ర్యాలీల్లో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్ అండ్ గైడ్స్ కేడెట్స్, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా అధికార యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది.