కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 15: స్వాతంత్య్ర వేడుకలను ఉమ్మడి జిల్లా పరిధిలోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. కరీంనగర్ శివారులోని చింతకుంటలో గల బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు.
హుజూరాబాద్‌లోని కేసీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి గంగాధర మండలం బూరుగుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జాతీయ జెండాను ఎగురవేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జీవన్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, తదితర నాయకులతో కలిసి జాతీయ జెండా ఆవిషరించారు. ధర్మపురి పట్టణంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అంబేదర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, మెట్పల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించి, వందనం చేశారు. సిరిసిల్లలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య జాతీయ పతాకాన్ని అవిష్కరించారు.