Citu Peddapally | పెద్దపల్లి, ఏప్రిల్3: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ఈనెల 19 తర్వాత నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీపెల్లి రవీందర్ తెలిపారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఖజాతో కలిసి డీపీవో కార్యాలయంలో డీఎల్పీవో వేణుగోపాల్‌కు గురువారం సమ్మె నోటీసు అందజేశారు.
అనంతరం రవీందర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు గత 40 ఏళ్లుగా గ్రామ పంచాయతీనే నమ్ముకుని సేవలు చేస్తున్న కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేదని వాపోయారు. ప్రతీ నెల వేతనాలు రాని పరిస్థితి ఉందని, ముఖ్యమంత్రి స్వయంగా జనవరి నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామన్న హామీ నేటికి నెరవేరలేదని విమర్శించారు.
గత ప్రభుత్వంలో ఇప్పటీ మంత్రులు స్వయంగా కనీస వేతనాలు అమలు చేస్తానని, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేస్తానని, ఉద్యోగ భద్రత కల్పిస్తానని, 34 రోజుల సమ్మె సందర్భంగా అనేక హామీలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఏం చేయడం లేదని దుయ్యబట్టారు. ఆరు నెలలుగా వేతనాలు చెల్లిస్తూ చెక్కులు జారీ చేసినప్పటికీ ఎస్టీవోలలో నిధులు లేక నిలిచిపోయాయే తప్ప వేతనాలు వచ్చిన పరిస్థితి లేదని, వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
జీపీలలో దాదాపు 90 శాతం దళితులని వివక్షతతో మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయకుండా ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తుందని, 51 జీవో సవరించాలని మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ కల్పించి పర్మినెంట్ చేయాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో రాష్ర్టవ్యాప్తంగా సమ్మెలు, పోరాటాలు, ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. జీపీ కార్మికుల సమస్యలను పరిష్కరించని యెడల ఈనెల 19 తర్వాత నిరవధిక సమ్మెలోకి వెళ్తామని, తక్షణమే రాష్ర్ట ప్రభుత్వం సమ్మెలోకి వెళ్లకుండా చర్యలు చేపట్టి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు తిట్ల శ్రీనివాస్, అంబాల లక్ష్మణ్ ,మామిడిపల్లి తిరుపతి, జంగాపల్లి నరేష్, మద్దెల రాజ్ కుమార్, శ్రీను, జీపీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.