శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కాలేజీలను నిరవధికంగా మూసివేయాలని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు దసరా సెలవులకు ముందే సమాచారం ఇచ్చారు. శాతవాహన పరిధిలో 60కి పైగా కళాశాలలు ఉండగా, దాదాపు రూ.120 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నట్టుగా తెలుస్తున్నది.
సర్వత్రా ఆందోళన
డిగ్రీ, పీజీ కాలేజీలను మూసివేయాలని శాతవాహన యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధుల నిర్ణయం అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నది. ప్రైవేట్ విద్యా సంస్థలు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడనుంది. కేవలం ఫీజు రీయింబర్స్మెంట్పై ఆధారపడి విద్యాబోధన అందిస్తున్న డిగ్రీ, పీజీ కాలేజీలపై ఆర్థిక భారం తీవ్రంగా పడుతున్నందున ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకున్నా, అప్పులు తీసుకొచ్చి కాలేజీలను నిర్వహిస్తున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు తలకు మించిన భారంగా మారినందున కళాశాలలను తిరిగి తెరిచే పరిస్థితి లేకుండా పోయిందని వాపోతున్నారు. అయితే, ఈ విషయమై ప్రభుత్వం దృష్టికి పలు మార్లు తీసుకువెళ్లినా స్పందన లేకుండా పోయిందని, రెండేళ్లుగా నిధులు విడుదల కాకున్నా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే కళాశాలలు నిర్వహిస్తున్నామని, ఇకపై విద్యార్థులకు చదువులు చెప్పేందుకు సుముఖంగా లేమని యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.