సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ మహమ్మారి కోరలు చాస్తోంది. ప్రభుత్వ దవాఖానల్లో ఔట్ పేషెంట్లు విపరీతంగా వస్తుండగా, ఇన్ పేషెంట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. వ్యాధుల బారిన పడుతున్న జనాలతో ప్రభుత్వ దవాఖానలు కిటకిటలాడుతున్నాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చి కరీంనగర్ దవాఖానల్లో టెస్టులు చేయించుకోగా ఈ ఒక్క నెలలోనే 140 మందికిపైగా డెంగ్యూ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలో మాత్రం 21 కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తానికి విషజ్వరాలు, డెంగ్యూ వాధిగ్రస్తుల సంఖ్య జిల్లాలో నానాటికీ పెరుగుతోంది.
కరీంనగర్, జూలై 28 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : ప్రతి వర్షాకాలంలో వచ్చే వ్యాధులతో జిల్లా ప్రజలు ఆందోళనకు చెందుతున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో వ్యాధులు విజృంభిస్తుండగా, ముఖ్యంగా డెంగ్యూ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అతిసార, మలేరియా, చికున్ గున్యా, మెదడువాపు వంటి వ్యాధులతో ప్రజలు సతమతమవుతున్నారు. దీనికి తోడు ప్రైవేట్ దవాఖానలు రోగులను భయానికి గురిచేయడం జిల్లాలో పరిపాటిగా మారింది.
తక్కువ ఖర్చుతో నయమయ్యే వ్యాధులకు రూ.లక్షలకు లక్షలు గుంజి వైద్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ దవాఖానల నుంచి వైద్య, ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకుంటున్నట్లు చెబుతున్నప్పటికీ అది ఆచరణలో మాత్రం నామ మాత్రంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరో పక్క డెంగ్యూతో ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే రోగులతో కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖాన నిండి పోతున్నది.
సాధారణంగా ఈ దవాఖానకు ప్రతి రోజూ వెయ్యి మంది ఔట్ పేషెంట్లుగా వస్తారు. కానీ, ఇప్పుడు ఈ సంఖ్య మరింత పెరిగింది. జ్వరంతో వచ్చిన వారికి వివిధ వైద్య పరీక్షలు చేస్తే ఇందులో పెద్ద సంఖ్యలో డెంగ్యూ కేసులు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. గత మూడు నెలల్లో డెంగ్యూ కేసులను పరిశీలిస్తే ఈ ఒక్క నెలలోనే పెద్ద సంఖ్యలో పెరిగాయి. మేలో కేవలం 5 కేసులు మాత్రమే నమోదుకాగా, జూన్‌లో 17 కేసులు నమోదయ్యాయి.
ఈ నెలలో ఏకంగా 140 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలతోపాటు మహారాష్ట్ర, చత్తీస్ఘఢ్ వంటి రాష్ర్టాలకు చెందిన వారు కూడా ఈ దవాఖానకు వచ్చి చికిత్స పొందుతున్నారు. కాగా, జిల్లాలో గత జనవరి నుంచి చూస్తే 52 డెంగ్యూ కేసులు నమోదైనట్లు, ఈ నెలలో 21 కేసులను గుర్తించి చికిత్స చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పెరుగుతున్న విష జ్వరాలు
జిల్లాలో వారం పది రోజులుగా విష జ్వరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వ దవాఖానలకు ఔట్ పేషెంట్లు పెరుగుతున్నారు. కరీంనగర్‌లోని ప్రభుత్వ దవాఖానలో ప్రతి రోజూ 1,300 నుంచి 1,400 మంది వస్తున్నారు. జిల్లాలోని 18 ప్రాథమిక, 6 అర్బన్ హెల్త్ సెంటర్లలో ఒక్కో చోట వందకుపైగా ఔట్ పేషెంట్లు వస్తున్నారు. హుజూరాబాద్ ఏరియా దవాఖానలో 400 నుంచి 450, జమ్మికుంట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 300 నుంచి 350, 4 బస్తీ దవాఖానలు, 97 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ఇతర ప్రభుత్వ హెల్త్ సెంటర్లలో కలిపి చూస్తే రోజుకు 8 వేల నుంచి 9 వేల మంది జ్వరాలు, దగ్గు, జలుబు ఇతర వ్యాధులతో బాధపడుతూ వస్తున్నారు.
సీజనల్ వ్యాధులపై అధికారులు ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో మండల వైద్యాధికారి, హెల్త్ సూపర్వైజర్, హెల్త్ అసిస్టెంట్, ఏఎన్‌ఎంతోపాటు ఆశా వర్కర్లు ఉంటారు. జిల్లా స్థాయిలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి నేతృత్వంలో కూడా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ఈ బృందాలు ప్రతి మంగళ, శుక్రవారం డ్రైడే పాటించాల్సి ఉంటుంది. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
అంతంత మాత్రంగానే అవగాహన
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గత ప్రభుత్వ హయాంలో అనేక ముందస్తు చర్యలు తీసుకునేవారు. వ్యాధులు రాకుండా ముందుగానే ప్రజలను అప్రమత్తం చేస్తూ పలు కార్యక్రమాలు చేపట్టేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించక పోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి పరిసరాలల్లోని చెత్తా చెదారాన్ని ఊరికి దూరంగా డంప్ యార్డులో వేసే వారు. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న నేపథ్యంలో పారిశుధ్యంపై అంతగా శ్రద్ధ పెట్టడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
ముఖ్యంగా పంచాయతీలకు నిధులు లేక పోవడంతో అనేక గ్రామాల్లో గత ప్రభుత్వ హయాంలో సమకూర్చిన ట్రాక్టర్లు కూడా మూలన పడ్డాయి. ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలు నిర్వహించేందుకు గ్రామాల్లో ప్రజలను సమీకరించే నాయకత్వం లేకుండా పోయింది. దీంతో అనేక గ్రామాల్లో పారిశుధ్య సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. వారం పది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇపుడు ఎక్కడ చూసినా పరిసరాలు దోమలకు నిలయంగా మారాయి. తాగు నీరు కలుషితమవుతోంది. దీనిపై స్థానికంగా పట్టించుకునే వారు కరువయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈసారి వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కేవలం సమీక్షలకే పరిమితం కాకుండా గ్రామాలు, పట్టణాల్లో క్షేత్ర స్థాయికి వెళ్లి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది.
జ్వర పీడితుల కోసం ప్రత్యేక వార్డు
జ్వర పీడితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశాం. రోజురోజుకూ పెరుగుతున్న సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ దవాఖానలోనే డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. పాజిటివ్ వచ్చిన వారికి అవసరమైన వారికి ఎస్డీపీలు, ఆర్డీపీలు, మందులు పూర్తి స్థాయిలో ఉన్నాయి. సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. వానకాలం కావడంతో ప్రజలు పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకొని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోనేందుకు సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి.
– జీజీహెచ్ సూపరింటెండెంట్ గుండా వీరారెడ్డి