కోరుట్ల, సెప్టెంబర్ 10: సర్కారు వైద్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ ప్రజారోగ్యంపై పట్టనట్లు వ్యవహరిస్తున్నది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నిర్ణయించిన గత ప్రభుత్వం, కోరుట్లలో దాదాపు రూ.12 కోట్లు వెచ్చించి ఆధునిక వసతులతో వంద పడకల దవాఖానను నిర్మించి, గతేడాది ప్రా రంభించగా, ఇప్పటికీ అందుబాటులోకి తేకపోవడం నిర్లక్ష్యానికి అద్దంపడుతున్నది. పూర్తి స్థాయి వైద్య సిబ్బంది లేక, పరికరాలు సమకూర్చకపోవడంతో ఏడాదిగా నిరుపయోగంగానే ఉంటోంది. ప్రస్తుతం వైరల్ ఫీవర్లతో నిత్యం వందలాది మంది రోగులు వస్తుండగా, పాత 30 పడకల వైద్యశాలే దిక్కుగా మారింది. అయితే వందలాది మంది రోగు లు వస్తుండడంతో మెరుగైన వైద్యం అంద డం లేదు. ఫలితంగా ప్రైవేట్‌ను ఆశ్రయించాల్సిన దుస్థితి దాపురించగా, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని పేద, మధ్య తరగతి ప్రజానీకం డిమాండ్ చేస్తున్నది.
వానాకాలం కావడంతో సీజనల్ వ్యాధు లు విజృంభిస్తుండగా, కోరుట్ల పట్టణంలోని పాత 30 పడకల దవాఖాకు రోగుల తాకిడి పెరుతున్నది. కోరుట్ల పట్టణం, పరిసర గ్రా మాల నుంచి నిత్యం వందలాది మంది జ్వర పీడితులు వస్తున్నారు. కొద్ది రోజులుగా 400 మంది వరకు ఓపీ ఉంటుంది. ఎక్కువగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతూ క్యూ కడుతుండగా, పూర్తిస్థాయిలో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. అయితే వంద పడకల ఏరియా దవాఖాన అందుబాటులోకి వస్తే ఈ పరిస్థితి ఉండేదికాదని, ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి దవాఖానలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, ఆర్థోపిడిషియన్ వైద్యులను నియమించి, పరికరాలను ఏర్పాటు చేసి సేవలు అందించాలని పేద ప్రజలు కోరుతున్నారు. రూ. కోట్లు వెచ్చించి నిర్మించిన భవనం నిరుపయోగంగా ఉంటే ఎలా..? మరీ ఇంత నిర్లక్ష్యం వద్దని సూచిస్తున్నారు.