వ్యవసాయరంగంలో రోజురోజుకూ కూలీల కొరత వేధిస్తున్నది. సేద్యంలో రైతన్నపై పెట్టుబడుల భారం పెరిగిపోతున్నది. మరోవైపు ఉపాధి హామీలో పొలం పనులు మాత్రమే వచ్చిన రైతు కూలీలకు పని కల్పించలేని పరిస్థితులు నెలకొనగా, వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు బహుళ ప్రయోజనాలే లక్ష్యంగా పొలం పనులకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలన్న నీతి అయోగ్ ఆలోచన తెరమరుగవుతున్నది. రెండింటినీ అనుసంధానిస్తే మంచి ఫలితాలుంటాయని ఆదేశాలు, సలహాలు, సూచనలు ఇచ్చి ఎనిమిదేండ్లు అవుతున్నా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉన్నది. మరోవైపు సేద్యపు పనులను ఈజీఎస్ స్కీంతో కలపాలని మొదటి నుంచీ కోరుకుంటూ వచ్చిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సైతం, 2022లోనే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినా స్పందన కరువైంది. ఈసారైనా ఈ రెండింటికీ దోస్తీ కలిస్తే అటు రైతుకు, ఇటు కూలీలకు మేలు జరుగుతుందని, ఆ దిశగా కేంద్రం ఆలోచన చేయాలని కర్షక, కార్మికలోకం కోరుతున్నది.
‘వ్యవసాయ రంగానికి, ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలి. అప్పుడే అటు రైతు, ఇటు కూలీకి మేలు జరుగుతుంది. భారత్ ఎంత అభివృద్ధి చెందినా, వ్యవసాయ రంగమే ఇప్పటికీ దేశానికి ప్రధాన రంగంగా ఉంది. 30 శాతం మంది నేరుగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తుండగా మరో 20 శాతం మంది పరోక్షంగా బతుకుతున్నారు. దేశ జాతీయ, తలసరి ఆదాయాల్లో వ్యవసాయ రంగ వాటానే అగ్రస్థానంలో ఉన్నది. ఇదిలా ఉంటే దేశంలో కోట్లాది మంది కూలీలకు పని దొరకడం లేదన్నది మరో నిజం. ప్రతి మనిషికి ఉపాధి చూపాలని, ఏడాదిలో కనీసం 150 రోజులు పని కల్పించేలా ఉపాధి హామీ పథకాన్ని తెచ్చారు. దేశంలో అతి ఎక్కువ సంఖ్యలో కూలీలు ఆధారపడి బతుకుతున్నది వ్యవసాయ రంగంపైనే. సాంకేతిక నైపుణ్యం పెరిగి, వ్యవసాయ రంగంలో యాంత్రికీకరణ ఎంతగా వృద్ధి చెందినా, గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది మంది రైతు కూలీలు ఉన్నారు. వారందరికీ పని దొరకాలంటే ఉపాధి పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానిస్తూ ఉత్తర్వులు జారీ చేసి, మార్గదర్శకాలు విడుదల చేయాలి. ఇది 2016లో కేంద్ర నీతి అయోగ్ చెప్పిన మాటలు, ఇచ్చిన ఆదేశాలు.
వ్యవసాయ రంగాన్ని, ఉపాధి పథకంతో అనుసంధానించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రం రెండేండ్ల క్రితమే తీర్మానించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభించి, దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై కూలీలకు ఉపాధి లభించని పరిస్థితి ఉత్పన్నమైన విషయం తెలిసిందే. కరోనా విపత్తు తర్వాత పలు సందర్భాల్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత రైతు కూలీలను, రైతులను ఆదుకునేందుకు ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానించాల్సిన అవసరం ఉందని ప్రకటిస్తూ వచ్చారు. ఈ మేరకు స్వయంగా కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విన్నవించడంతోపాటు, ఈ విషయమై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి నివేదించినా పట్టించుకోలేదు.
వ్యవసాయ రంగాన్ని ఉపాధిహామీ పథకంతో అనుసంధానం చేసే విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నీతి అయోగ్ పేర్కొంది. వ్యవసాయ కూలీలకు, ముఖ్యంగా మహిళా కూలీలకు ఉపాధి కల్పించే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అభిప్రాయపడింది. పంట పెట్టుబడిలో వ్యవసాయ కూలీలకు ఉపాధి పథకం ద్వారా కూలి చెల్లించేలా చూడాలని పేర్కొంది. పెట్టుబడిలో 75 శాతం రైతు పెట్టుకునేలా ఉండాలని, 25 శాతం ఉపాధి పథకం ద్వారా ప్రభుత్వం చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. వ్యవసాయ రంగంలో ఇప్పటికీ దుక్కులు దున్నడం, వరినాటు వేయడం, కలుపు తీయడం, పత్తి గింజలు అలకడం, పత్తి ఏరడం, పత్తి క్రాసింగ్ వంటి పనులు ఇంకా వ్యవసాయకూలీలే చేస్తున్న విషయం తెలిసిందే. జగిత్యాల జిల్లాలో వానకాలం, యాసంగిలో సేద్యం అధికంగా జరుగుతున్న నేపథ్యంలో కూలీలకు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు ఒక్కో కూలీకి చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఆ మొత్తాలను ఉపాధి హామీ కింద ప్రభుత్వమే చెల్లించాలని, అలాగే రైతు చేపట్టే వ్యవసాయ ఆధారిత పనులను సైతం ఉపాధి పథకంలో చేయాలని సూచించింది. ఇలా చేయడం వల్ల రైతుపై కూలీల భారం తగ్గడంతో పాటు, కూలీలకు ఉపాధి లభిస్తుందన్నది నీతి అయోగ్ ఉద్దేశం.
రైతు కూలీలకు, ముఖ్యంగా మహిళా రైతు కూలీలకు వ్యవసాయ పనులు చేసే అవకాశం కల్పించడంతో పాటు, వ్యవసాయ ఆధారిత ఇతర పనులకు పథకాన్ని వర్తింపజేయాలని నీతి అయోగ్ అభిప్రాయపడింది. కూరగాయల సాగు అభివృద్ధి కోసం వేసే పందిళ్లు, షెడ్ల నిర్మాణం, నీటి కాల్వలు, వ్యవసాయ బావుల తవ్వకం, బావుల్లో పూడికతీత, గ్రామాల్లో సమష్టిగా రైతులకు నీటి వసతిని కల్పించే ఫీడర్ చానల్స్, కుంటల పూడికతీత లాంటి పనులను పథకంలో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
ఉపాధి హామీ పథకాన్ని, వ్యవసాయ రంగంతో అనుసంధానించడం వల్ల జిల్లాకు పెద్ద మొత్తంలో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. దాదాపు 11 లక్షల జనాభాతో ఉన్న జిల్లాలో 3,36,076 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో ఉపాధి హామీ పథకం కింద 1.05 లక్షల కుటుంబాలకు గుర్తింపుకార్డులు ఉన్నాయి. జిల్లాలో 1.67 లక్షల జాబ్‌కార్డులు ఉండగా, ఇందులో 2.73 లక్షల మంది కూలీలుగా ఉన్నారు. కాగా గత ఆర్థిక సంవత్సరంలో 1.02 లక్షల కుటుంబాలకు 150 రోజుల పాటు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, 0.79 లక్షల కుటుంబాలకు ఉపాధి చూపారు. దాదాపు లక్షకు పైగా కూలీలకు పథకం ద్వారా ప్రయోజనం ఉపాధి లభించగా, వారికి రూ.69.15 కోట్ల నగదును ప్రభుత్వం చెల్లించింది. అయితే జాబ్ కార్డులకు తగ్గట్టు కూలీలు ఉపాధిని పొందలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం మహిళా కూలీల్లో చాలా మందికి కేవలం వ్యవసాయం పనులు మాత్రమే నేర్చుకొని ఉండడం, ఇతర భవన నిర్మాణాలు, కందకాలు తవ్వకం, సిమెంట్ పనులు చేయరాకపోవడమేనని అధికారులు, నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే 50 శాతానికి పైగా నమోదిత కూలీలు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ రంగంతో ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేస్తే 2.50 లక్షల మంది జాబ్‌కార్డు దారులకు ఏటా 150 రోజుల పాటు ఉపాధి లభ్యం అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యవసాయ రంగం, ఉపాధి హామీ పథకం రెండు అనుసంధానమైతే కూలీలకు ఉపాధి లభ్యం కావడంతో పాటు, సేద్య రంగానికి, ముఖ్యంగా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో రెండు పంట కాలాల్లో కలిపి దాదాపు 8 లక్షల ఎకరాల్లో భూమి సాగవుతోందని, రమారమి రెండు లక్షల మంది రైతులు, లక్షయాభై వేల మంది రైతు కూలీలు సేద్యరంగంపై ఆధారపడి ఉన్నారని వారు చెబుతున్నారు. రైతులకు పంటల సమయంలో కూలీల చెల్లింపు పెద్ద సమస్యగా మారిందని, కూలీలకు 25 శాతాన్ని ఉపాధి హామీ పథకంలో చెల్లిస్తే రైతులపై భారం తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వ్యవసాయ వృద్ధితో ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని, దీంతో జిల్లా ఆర్థిక పరిపుష్టతను సాధిస్తుందని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు.
ఎనిమిదేండ్ల క్రితం నీతి అయోగ్ నేరుగా కేంద్ర ప్రభుత్వానికి సూచన చేసినా, వ్యవసాయ రంగం, ఉపాధి హామీ పథకం అనుసంధాన ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ దిశలో చర్చ జరిపి చట్టం రూపొందించలేదు. తెలంగాణ సీఎం హోదాలో కేసీఆర్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా, అసెంబ్లీ తీర్మానం చేసి పంపించినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే ఉపాధి హామీ కూలీలకు ముఖ్యంగా మహిళా కూలీలకు ఉపాధి అందని ద్రాక్షగా మారుతున్న పరిస్థితుల్లో ఈ సారైనా కేంద్రం కరుణించాలని రైతులు, ఉపాధి హామీ కూలీలు ఆర్థిక వేత్తలు కోరుతున్నారు. చట్టం చేస్తే వచ్చే యాసంగిలో రైతులకు, రైతు కూలీలకు మేలు జరుగుతుందని అంటున్నారు.