Chada Venkat Reddy | చిగురుమామిడి, డిసెంబర్ 24: కరంట్ వినియోగాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేస్తున్న మోడల్ సోలార్ విలేజ్ లో గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, తెలంగాణ రెడ్ కో జిల్లా మేనేజర్ డీ మనోహర్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ అల్లెపు సంపత్ అధ్యక్షతన మోడల్ సోలార్ విలేజ్ పై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాన్ని మోడల్ గ్రామంగా ప్రకటించినప్పటి నుండి గ్రామంలో ఇంటింటా సర్వే చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటికే కొంతవరకు పనులను చేస్తున్నట్లు పేర్కొన్నారు. మొదటగా బిల్డింగ్ ఉన్నవారికి, గృహజ్యోతి పథకం వర్తిస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. దశలవారీగా గ్రామంలో సోలార్ ఉత్పత్తి వినియోగాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు.
వారం రోజుల్లోగా పూర్తిస్థాయిలో పనులను చేపట్టి గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్ గా ఏర్పాటు చేస్తామని వారు పేర్కొన్నారు. తమ గ్రామాన్ని మోడల్ విలేజ్ గా ఎంపిక చేసినందుకు సీపీఐ నేత చాడ, నూతన సర్పంచ్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ట్రాన్స్కో ఏడీ ఈ నరేందర్ ఎంపీడీవో విజయ్ కుమార్ ఎంపీవో కిరణ్ కుమార్ డీవో మునీందర్ రెడ్డి ఏడీవో లక్ష్మీకాంతరావు, ఉప సర్పంచ్ బిల్ల సంతోష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అజయ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.