వేములవాడ, జూన్ 26: ‘బిడ్డా మంచిగున్నవా..? ఇంటికొస్తవా..?’ అని ఆప్యాయంగా పలుకరించిన ఆ తల్లి అంతలోనే కుప్పకూలింది. వారం క్రితమే సంస్కృత పాఠశాలలో చేరిన కొడుకును చూసేందుకు వచ్చి, ‘మంచిగా చదువుకో బిడ్డా’ అని చెప్పిన ఆ మాతృమూర్తి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లాలోని పొలాసకు చెందిన నరేశ్, చందన (32) దంపతులకు ఒక కొడుకు సుశాంత్, ఇద్దరు బిడ్డలు.
అయితే కొడుకు సుశాంత్ గత గురువారం వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ సంస్కృత పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశం పొందాడు. కాగా, కొడుకును చూసేందుకు ఆ తల్లిదండ్రులు గురువారం పాఠశాలకు వచ్చి సుశాంత్‌తో మాట్లాడారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు. కొడుకుతో ఆ తల్లి ఆప్యాయంగా మాట్లాడింది. ‘ఇంటికి వస్తావా.. ఇకడే ఉంటావా..?’ అని అడిగింది. సుశాంత్ ఇంటికి రానని చెప్పడంతో మంచిగా చదువుకోవాలని బుద్ధి మాటలు చెప్పింది.
తర్వాత చందన పై అంతస్తులో ఉన్న వాష్ రూమ్‌కి వెళ్లి, అకడే పడిపోయింది. గమనించిన పాఠశాల సిబ్బంది ప్రిన్సిపాల్ మల్లారెడ్డికి సమాచారం అందించారు. కళ్లు తిరుగుతున్నాయని, ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో మల్లారెడ్డి ఉపాధ్యాయులతో కలిసి సీపీఆర్ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసేందుకు వచ్చిన ఆర్బీఎస్కే వైద్య బృందం కూడా చందనను పరీక్షించి, 108 అంబులెన్సులో స్థానిక ఏరియా దవాఖానకు తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే గుండెపోటుతో మృతి చెందిందని నిర్ధారించారు. దీంతో నరేశ్, సుశాంత్ రోదనలు మిన్నంటాయి.