విద్యానగర్, ఫిబ్రవరి 4: ‘క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ జబ్బుగా మారిపోయింది. ప్రాథమిక దశలో గుర్తిస్తే ఈజీగా నయమైపోతుంది. ఈ క్రమంలో అందరం కలిసి వ్యాధిని నిర్మూలిద్దాం’ అని అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నగరంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మహిళలకు క్యాన్సర్‌పై అవగాహన, ఉచిత నిర్ధారణ పరీక్షల వైద్య శిబిరాన్ని మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న శిబిరాన్ని ఉద్దేశించి, ఎమ్మెల్యే మాట్లాడారు. క్యాన్సర్‌ను మొదట్లో నిర్ధారిస్తే వ్యాధి నయం చేసుకోవచ్చని, క్యాన్సర్ అనగానే భావితరం ఏమవుతుందో అనే ఆందోళన నేడు నెలకొందన్నారు. క్యాన్సర్‌పై అవగాహన పెంచుకొని మొదట్లోనే వ్యాధి నిర్ధారణ చేసుకుంటే నయం చేసుకోవచ్చని తెలిపారు. క్యాన్సర్ పరీక్షలకు మహిళలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు సేవచేసే భాగ్యం వైద్యులకు దకిందని, వైద్యులు క్యాన్సర్ నిర్మూలన కోసం అవసరమైతే నిర్బంధ పరీక్ష జరిపి వారి కుటుంబాలను కాపాడాలని కోరారు.
క్యాన్సర్‌పై అవగాహన, ఉచిత నిర్ధారణ శిబిరాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ సూచించారు. ప్రస్తుత కాలంలో క్యాన్సర్ చాపకింద నీరులా ఎకువ మందికి వస్తున్నందున, ఈ ఉచిత శిబిరంలో పరీక్షలు చేయించుకోవాలని, అందుకు కార్పొరేటర్లు, ఇతర నాయకులు కృషి చేయాలన్నారు. 30 ఏండ్ల క్రితం తన సోదరికి ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించి, చికిత్స అందించామని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె వయస్సు 50 ఏండ్లు అని పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. 20 ఏండ్ల క్రితం తాను ఎంపీగా ఉన్నప్పుడు బసవతారకం హాస్పిటల్ నుంచి భూపాలపల్లికి క్యాన్సర్ నిర్ధారణ కోసం బస్సును తెప్పించామని, పరీక్షలు చేయించినట్లు గుర్తు చేసుకున్నారు.
అందులో 12 మందికి నిర్ధారణ కాగా, 8 మందికి ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స అందించడంతో వారంతా ఆరోగ్యంగా ఉన్నారని, వారి కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఫోన్ చేసి నాకు కృతజ్ఞతలు తెలుపడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, సుడా మాజీ చైర్మన్ జీవీ రామకృష్ణరావు, కార్పొరేటర్లు వాల రమణ రావు, గుగ్గిల్ల జయశ్రీ, ఎడ్ల సరిత, పిట్టల వినోద, నాంపల్లి శ్రీనివాస్, గంట శ్రీనివాస్, కుర్ర తిరుపతి, ప్రతిమ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ బోయినపల్లి మాధవి, సీనియర్ వైద్యులు డాక్టర్ చెన్నాడి జగన్మోహన్రావు, చెన్నాడి అమిత్‌రావు, సీఈవో రామచంద్రారావు, పలువురు ప్రతిమ చల్మెడ దవాఖాన వైద్యులు, కొడిమ్యాల ఎంపీపీ స్వర్ణలత, బోయినపల్లి మాజీ ఎంపీపీ సత్తినేని భాగ్యలత పాల్గొన్నారు.
40 ఏండ్లు దాటిన ప్రతి మహిళ మూడేళ్లకోసారి క్యాన్సర్ స్రీనింగ్ చేయించుకోవాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో 30 ఏండ్లు దాటగానే పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకుంటున్నారు. నా దగ్గరకు ప్రసవం కోసం వచ్చే వారి తల్లిని తప్పకుండా స్రీనింగ్ చేయించుకోవాలని సూచిస్తున్నా. ఇప్పటికే పదిమందికి నిర్ధారణ జరిగింది. ప్రాథమిక దశలోనే ఉండడంతో చికిత్స తీసుకోవడంతో తగ్గిపోగా, నాకు ఎంతో తృప్తినిచ్చింది. ఇలా ప్రాథమిక దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు.
– డాక్టర్ బోయినపల్లి మాధవి (గైనకాలజిస్ట్ )
క్యాన్సర్ నిర్ధారణ కాగానే కొంతమంది దానిని అంటువ్యాధిగా భావించి వారిని కుటుంబానికి దూరం పెడుతున్నారు. దీంతో వారు మానసికంగా కుంగిపోతున్నారు. ఫలితంగా రోగ నిరోధకశక్తి తగ్గి, అనారోగ్య సమస్యలు ఎక్కువై ఇబ్బందులు పడుతున్నారు. క్యాన్సర్ అంటువ్యాధి కాదు. వ్యాధి వచ్చిన వారిని ప్రేమగా చూసుకుంటే వారి ఆయుష్షు మరింత పెరుగుతుంది. క్యాన్సర్ రాకుండా 9 నుంచి 14 ఏండ్ల బాలికలకు రెండు డోస్ వ్యాక్సిన్లు. 14 నుంచి 28 ఏండ్ల వాళ్లకు మూడు డోస్ వ్యాక్సిన్ల చొప్పున వేయించుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్లు వేసుకోవడంతో 90% క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు.
– డాక్టర్ చేతన, (ఆంకాలజిస్ట్ )
రెండు నెలల నుంచి కూర్చొని లేవగానే తల తిప్పుతుంది. నడుస్తుంటే కింద పడిపోతున్న ఫీలింగ్ కలిగింది. ఈ రోజు శిబిరానికి రాగానే బీపీ పరీక్షలు చేశారు. బీపీ లెవల్స్ హెచ్చుతగ్గులతోనే తల తిప్పినట్లు అవుతున్నదని చెప్పి మందులు ఇచ్చారు. షుగర్ పరీక్ష సైతం చేశారు. కానీ లేదు. మాలాంటోళ్ల కోసం ఇలాంటి శిబిరాలు నిర్వహించి మందులు ఫ్రీగా అందించడం ఆనందంగా ఉంది. ప్రతిమ వైద్యులకు మేం ఎప్పటికీ రుణపడి ఉంటాం.
– విరంగి కల్పన, గృహిణి సుభాష్ నగర్