కార్పొరేషన్, జూలై 18 : భావితరాలకు గొప్ప కరీంనగర్‌ను అందించాలన్న లక్ష్యంతో తాము అభివృద్ధి పనులు చేస్తున్నామని, రాష్ట్రంలో రెండో గొప్ప నగరంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. వచ్చే ఆరు ఎనిమిది నెలల్లో నగరం రూపురేఖలు మారుస్తామని, ఇప్పటికే నగరాన్ని ఎంతో అభివృద్ధి చెప్పారు. ప్రపంచస్థాయి పర్యాటకులను కూడా ఇక్కడకు తీసుకురావాలన్న ఆలోచనతోనే తాము పనులు చేస్తున్నామని, ఆగస్టు చివరినాటికి మానేర్ రివర్ ఫ్రంట్ మొదటి దశ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. యాభై ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని, నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేసిందని మండిపడ్డారు. రోడ్లను తవ్వి విధ్వంసం చేసిన కాంగ్రెస్ నాయకులు, వాటిని బాగు చేసేందుకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి మంజూరు చేయించలేకపోయారని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని తమకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ మళ్లీ మాయమాటలు చెబుతున్నారని, తప్పిపోయి మళ్లీ అవకాశమిస్తే మళ్లీ దోచుకుంటారని, నగరాన్ని గుడ్డి దీపంగా మార్చి విధ్వంసం చేస్తారని ఆరోపించారు. ఆకలి మీదున్న కాంగ్రెస్ నాయకులు కేబుల్ బ్రిడ్జి కేబుళ్లు, తెలంగాణ చౌక్‌లోని ఫౌంటేన్‌లో ఉన్న అల్యూమీనియాన్ని అమ్ముకుంటారని విమర్శించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కరీంనగర్ జిల్లాకేంద్రంలోని కోతిరాంపూర్ చౌరస్తాలో చేపట్టనున్న ఐలాండ్ సుందరీకరణ పనులకు మేయర్ యాదగిరి సునీల్‌రావుతో కలిసి మంగళవారం మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కరీంనగర్‌ను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యేంత వరకు మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్లుగా కాంగ్రెస్ నాయకులే ఉన్నారని గుర్తు చేశారు. వారి పాలనలో నగరంలోని రోడ్లన్నింటినీ తవ్వి నడవరాకుండా చేశారని ధ్వజమెత్తారు. ఆయా రోడ్లల్లో నూతనంగా రోడ్డు వేసేందుకు కనీసం నిధులు కూడా తీసుకురాలేదన్నారు. జిల్లా కేంద్రాన్ని కుగ్రామంగా మార్చిన ఘనత కాంగ్రెస్ నాయకులకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కరీంనగర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారన్నారు. గత ఎన్నికల్లో 60 డివిజన్ల పరిధిలో ఒక్క కాంగ్రెస్ కార్పొరేటర్‌ను కూడా ప్రజలు గెలిపించలేదని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇదే చరిత్ర పునరావృతం అవుతుందని తెలిపారు. నగర ప్రజలు బీఆర్ఎస్పై నమ్మకంతో ఓట్లు వేశారని, వారికి అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలు మూడుసార్లు అవకాశం ఇచ్చారని, కరీంనగర్ మేయర్‌గా రెండుసార్లు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్‌కు దీటుగా కరీంనగర్‌ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
ఇందుకోసం సీఎం కేసీఆర్ సహకారంతో వేల కోట్లు నిధులు తీసుకొచ్చి నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కరీంనగర్‌ను పూర్తిగా మురికికూపంగా మార్చారని మండిపడ్డారు. వారి హయాం లో పేరుకుపోయిన దరిద్య్రాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఆ కాలంలో నగరంలో డెంగీ ప్రబలడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని విమర్శించారు. స్వయం పాలనలో కరీంనగరాన్ని అద్భుతంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. నగరంలో ఇప్పటికే ఏడు చౌరస్తాలను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దామని, మరో 6 చౌరస్తాలను సుందరంగా మార్చేందుకు పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. నెల రోజుల్లో కోతిరాంపూర్, పద్మనగర్, సిక్కువాడ చౌరస్తాల సుందరీకరణ పనులను పూర్తి చేస్తామన్నారు. ఆర్ అండ్ బీ చౌరస్తా, నాకా చౌరస్తాలను కూడా అద్భతంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకొని పనులు చేపడుతామన్నారు. డైనమిక్ లైటింగ్‌తో కేబుల్ బ్రిడ్జి ఆకర్షణీయంగా మారిందన్నారు. నగర ప్రజల జీవన ప్రమాణాలను పెంచి, భూముల విలువలు పెరిగేలా కొత్త కంపెనీలను తీసుకురావాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్ ఐలేందర్‌యాదవ్, కుర్ర తిరుపతి, గందె మాధవి, నాయకులు పవన్, స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.