గంగాధర, జూన్ 17 : జీవకోటికి చెట్టే ఆధారమని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గంగాధర మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ హరితోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం నర్సరీలో పెంచుతున్న మొక్కలను పరిశీలించి, విద్యార్థులకు మొక్కలు అందజేశారు. నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా సంరక్షిస్తున్న వన సేవకులను సన్మానిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు.
గ్రామాల్లో ఉద్యమంగా మొక్కలు నాటడంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పచ్చనిహారంగా మారిందన్నారు. ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో మల్హోత్ర, ఎంపీవో జనార్దన్‌రెడ్డి, ఏపీవో చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ లోకిని ఎల్లయ్య, వైస్ చైర్మన్ సామంతుల శ్రీనివాస్, సర్పంచ్ మడ్లపెల్లి గంగాధర్, ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి, ఉపసర్పంచ్ నాగలక్ష్మి, నాయకులు తాళ్ల సురేశ్, గాలిపెల్లి శ్రీనివాస్, సముద్రాల అజయ్, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.