సిరిసిల్ల రూరల్, జూలై 19: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు సింగిల్విండోలో 589 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. అందులో 2023 డిసెంబర్9నాటికి 339 మంది 2లక్షలలోపు రుణం తీసుకున్నారు. వీరిలో ఒక లక్షలోపు రుణాలు తీసుకున్నవారు 279 మంది ఉన్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో 279 మంది పేర్లు వచ్చాయి. గురువారం సాయంత్రంలోగా ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని చెప్పినా.. ఏ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ కాలేదు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పాలకవర్గ సభ్యుల చుట్టూ తిరుగుతున్నారు. ఈవిషయంపై లీడ్ బ్యాంక్ అధికారిని సంప్రదించగా, శనివారం క్లారిటీ వస్తుందని, రైతు రుణమాఫీ డబ్బులు అందుతాయని చెప్పారు.
సింగిల్ విండోలో ఒక్క రైతుకు కూడా లక్ష రుణమాఫీ వర్తించలేదు. లక్షలోపు రుణాలు తీసుకున్న 279 మంది ఖాతాల్లో పైసలు జమకాలేదు. బ్యాంక్ అధికారులను కలిసినా స్పష్టత ఇవ్వలేదు. శనివారం పడుతాయని అంటున్నా క్లారిటీగా చెప్పడం లేదు. లీడ్ బ్యాంక్ అధికారులకు కలిసి వివరించాం. రుణమాఫీ పైసలు వచ్చేటట్టు చేస్తమని చెప్పిన్రు. ఉన్నతాధికారులు స్పందించాలి.