KARIMNAGAR | కలెక్టరేట్, ఏప్రిల్ 11 : పుట్టిన అరగంటలోపు నవజాత శిశువులకు పట్టించే ముర్రుపాలతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, అంగన్వాడీ సూపర్వైజర్లు స్వప్న, అరుణ అన్నారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నగరంలోని జ్యోతినగర్, శాంతినగర్ అంగన్వాడీ కేంద్రాల్లో వేర్వేరుగా శుక్రవారం సభలు నిర్వహించారు.
ఆయాచోట్ల నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న వారు మాట్లాడుతూ పుట్టిన నాటి నుంచి ఆరు నెలల దాకా తల్లి పాలు మాత్రమే శిశువులకు పట్టించాలని, తద్వారా భవిష్యత్లో అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. అనంతరం అనుబంధ పోషకాహారం అందిస్తే వారి జీవితకాలమంతా ఆరోగ్యకరంగా ఉంటారని పేర్కొన్నారు.
వెయ్యి రోజుల ప్రాముఖ్యతపై సభలకు హాజరైన తల్లులకు వివరించారు. విద్యార్జనపై అవగాహన కల్పించే క్రమంలో అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రీస్కూళ్ళకు పిల్లలను విధిగా పంపాలని సూచించారు. అనంతరం నిర్వహించిన ప్రీస్కూల్ మేళాలో చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
వీక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఆయా కార్యక్రమాల్లో ప్రత్యేకాధికారి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు గౌస్, అంగన్వాడీ టీచర్లు సరిత, జమున, సునీత, కనకతార, ఇందిరజుబేదా, శారద, సరోజ, కవితాదేవి, శ్రీలత, కాత్యాయిని, డా. బి. సురేందర్, ప్రశాంత్, ఉమాదేవి, రమాదేవి, జ్యోష్న, వార్డు అదికారి సత్తిరెడ్డితో పాటు గర్భవతులు, బాలింతలు, పిల్లల తల్లులు హాజరయ్యారు.