Heart disease | కోల్ సిటీ, జూలై 3: ఇదివరకు 50 ఏళ్లకు పైబడిన వయసు వారికి అరుదుగా వచ్చే గుండె జబ్బులు ప్రస్తుత కలుషిత వాతావరణం వల్ల వయసుతో నిమిత్తం లేకుండా చిన్నా, పెద్దా, ఆడా, మగ అనే తేడా లేకుండా అందరికీ గుండె జబ్బులు రావడం సాధారణంగా మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉంటూ నిత్య వ్యాయామం, సమతుల్యమైన ఆహారం తీసుకోవడమే ఏకైక మార్గమని కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ అన్నారు.
గోదావరిఖని బస్టాండ్ ఏరియా ఆటో డ్రైవర్లకు కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో గురువారం ఉచిత గుండెవ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. దాదాపు 120 మంది డ్రైవర్లకు ఉచితంగా గుండె పరీక్షలు చేశారు. ఆస్పత్రి జనరల్ ఫిజిషియన్ డా. నాగరాజు, డీఎంఓ డా. హర్షిత్ బీపీ, షుగర్, ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ నిత్యం ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చడంలో ఆటో డ్రైవర్లు మానసిక ఒత్తిళ్లకు లోనై మద్యంకు అలవాటు పడి అనారోగ్యాలను కొనితెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు.
అలాంటి అలవాట్లకు దూరంగా ఉంటూ ప్రశాంత జీవన విధానంను అలవర్చుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకోవడం వల్ల జబ్బులను ముందే గుర్తించి నయం చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఆటో డ్రైవర్లకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే ఉద్దేశంతోనే ఈ మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు ఆసంపల్లి తిరుపతి, సెక్రెటరీ ఈర్ల సారయ్య, భవాని శంకర్, తాండ్ర రాజేందర్, గోపగోని బాలరాజు, ఆస్పత్రి మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, బొంగోని హరీష్, యూనస్ తదితరులు పాల్గొన్నారు.