Illegal transfers | గోదావరిఖని : రాజకీయ కక్షతోనే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ జావిద్ పాషా, బీఆర్ఎస్ నాయకుడు బాలసాని కొమరయ్య (ఎర్ర కొమురయ్య) ను సింగరేణిలో అక్రమంగా బదిలీ చేశారని, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి ఆరోపించారు.
గోదావరిఖని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో ఆయన శనివారం మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల పై జరుగుతున్న కక్ష సాధింపు చర్యలు సింగరేణిలో కూడా మొదలయ్యాయని, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి చెందిన ముఖ్య నాయకులను గోదావరిఖని నుంచి మణుగూరు ఇల్లందు లకు బదిలీలు చేయడం కేవలం కక్ష సాధింపు చర్య మాత్రమేనని ఆయన ఆరోపించారు. సర్వీస్ లో ఎలాంటి రిమార్కులు లేని కార్మికులను ఎలాంటి కారణం లేకుండా ఎలా బదిలీ చేస్తారని ఆయన ప్రశ్నించారు.
మాదాసు రామ్మూర్తి బాలసాని కొమరయ్య( ఎర్ర కొమురయ్య)లకు కేవలం ఏడాది సర్వీస్ మాత్రమే ఉందని, అయినా వారిని ఇక్కడి నుంచి బదిలీ చేయడం సరైనది కాదని ఆయన మండిపడ్డారు. బదిలీ చేసిన నాయకులను తక్షణమే యథా స్థానంలో ఉండే విధంగా సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని, లేకుంటే తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం తో పాటు ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులపై కక్ష సాధింపు చర్యలు మానుకోకుంటే ప్రజలే వారికి తగిన విధంగా గుణపాఠం చెప్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సెంట్రల్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య, అథాకార ప్రతి నిధి పర్లపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.