గతంలో దొడ్డుబియ్యాన్ని రీసైక్లింగ్ చేసి దందా నడిపిన పలువురు మిల్లర్లు, సన్నబియ్యాన్ని సైతం వదలడం లేదు. అక్రమ వ్యాపారంతో కోట్లు గడించిన అక్రమార్కులు, ఇప్పటికీ తమ దారి మార్చుకోవడం లేదు. ఇప్పుడు పల్లె నుంచి మిల్లు వరకు ఒక చైన్ సిస్టం ఏర్పాటు చేసుకొని, పకడ్బందీగా సన్నబియ్యం సేకరించి యథేచ్ఛగా దందాను నడుపుతున్నారు. పైగా సేకరించిన రేషన్ బియ్యాన్ని తిరిగి సర్కారుకే అప్పగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా సీఎంఆర్ ధాన్యాన్ని అమ్ముకున్న మిల్లర్లు, ఈ వ్యవహారంలో ఎక్కువగా భాగస్వాములు అవుతున్నారు. ఈ తరహా బాగోతంపై పకడ్బందీగా నిఘా ఉంచాల్సిన, ఉమ్మడి జిల్లా యంత్రాగం నిద్ర మత్తులో తూగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ అధికారులు వచ్చి ఉమ్మడి జిల్లాలోని పలు మిల్లుల్లో నడుస్తున్న సన్నబియ్యం దందాలను వెలుగులోకి తెస్తుంటే.. స్థానిక అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తతున్నాయి.
సన్నబియ్యం దందా ఒక చైన్ సిస్టం తరహాలో సాగుతున్నది! కొంత మంది మిల్లర్లు, వ్యాపారులు కలిసి.. పల్లె నుంచి మిల్లు వరకు ఒక లింక్ ఏర్పాటు చేసుకొని అడ్డదారి తొక్కుతున్నారు. సెలెక్టు చేసుకున్న కొంతమందిని బైక్‌లు, ఆటోలపై గ్రామాల్లో తిప్పుతూ.. రేషన్ కార్డుదారులు, అలాగే రేషన్ దుకాణాల నుంచి సన్నబియ్యం సేకరిస్తున్నారు. తర్వాత వేర్వేరు ప్రాంతాల్లో నిల్వ చేసి, ఆ తర్వాత వివిధమార్గాల ద్వారా మిల్లులకు తరలిస్తున్నట్టు తెలుస్తున్నది.
కరీంనగర్, డిసెంబర్ 7 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : గతంలో రేషన్ దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి, అడ్డదారిలో కోట్లు గడించిన కొంత మంది మిల్లర్లు.. నేటికీ ఆ దందా నుంచి బయటకు రావడం లేదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించాలన్న దురాశతో ఆ అక్రమ వ్యాపారాన్ని వదలడం లేదు. ఇప్పటికే అదే దారిలో నడుస్తున్నట్టు తెలుస్తుండగా, ఉమ్మడి జిల్లాలో రేషన్ సన్నబియ్యం దందా యథేచ్ఛగా సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని (కస్టం మిల్లెడ్ రైస్) రైస్‌మిల్లులకు మర ఆడించేందుకు అప్పగిస్తుండగా, కొంతమంది యజమానులు మాత్రం సీఎంఆర్ ధాన్యాన్ని అమ్ముకున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, తూతూమంత్రంగా వ్యవహరిస్తున్నారు.
దీంతో ధాన్యం అమ్ముకున్న వ్యాపారులు, పెట్టుబడి లేకుండా వ్యాపారం చేస్తున్నారు. ఈ లోటును పూడ్చుకోవడానికి కొంతమంది మిల్లర్లు, సన్నబియ్యం దందాను మొదలు పెట్టారు. ఇటీవల రాష్ట్ర సివిల్ సైప్లె, టాస్క్‌ఫోర్స్ అధికారులు జగిత్యాల జిల్లాలో ఓ మిల్లులో భారీ మొత్తంలో సన్నబియ్యాన్ని పట్టుకొని కేసులు నమోదు చేశారు. ఇటీవల కాలంలో కరీంనగర్ జిల్లాలోనూ మూడుచోట్ల సన్నబియ్యం పట్టుకున్నారు. అమ్ముకొని కోట్లు కూడబెట్టుకున్న ధాన్యం స్థానంలో బియ్యం ఇవ్వడానికి, ప్రస్తుతం సన్నబియ్యాన్ని టార్గెట్ చేసుకొని కొందరు మిల్లర్లు దందా నడుపుతున్నారు. అందుకోసం రేషన్‌బియ్యాన్ని కొని ప్రభుత్వానికి కస్టం మిల్లెడ్ రైస్ (సీఎంఆర్) కింద అప్పగిస్తున్నారు. ఇలా అడ్డదారులు తొక్కుతూ అక్రమంగా ఆర్జిస్తున్నారు.

Rice Bag
పల్లె నుంచి మిల్లు వరకు..
తమ అక్రమ దందా సాగించేందుకు కొంతమంది మిల్లర్లు, వ్యాపారులు.. పల్లె నుంచి మిల్లు వరకు ఒక చైన్ ఏర్పాటు చేసుకున్నారు. కొంతమందిని సెలెక్టు చేసుకొని, వారిని ముందుగా గ్రామాల్లో బైక్‌లపై తిప్పుతున్నారు. సదరు వ్యక్తులు బైక్‌లు, ఆటోలపై తిరిగి ఒకవైపు రేషన్ కార్డుదారుల నుంచి, అలాగే రేషన్ దుకాణాలనుంచి కిలోకు 14 చెల్లించి సన్నబియ్యం సేకరిస్తున్నారు. ఇవే బియ్యాన్ని సదరు వ్యక్తులు మిల్లర్లు, వ్యాపారులకు కిలోకు 17 చొప్పున విక్రయిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారమంతా పకడ్బందీగా నడుస్తున్నది. అందుకోసం పలువురు రేషన్ డీలర్లు.. దుకాణంలోనే కార్డుదారుల వద్ద వేలిముద్ర తీసుకొని, బియ్యం ఇవ్వకుండా కిలోకు 9 లేదా 10 చెల్లిస్తున్నారు.
గ్రామాల వారీగా సేకరించిన బియ్యాన్ని ముందుగా వేర్వేరు ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఆటోల్లో మరో ప్రాంతానికి తరలిస్తున్నారు. అక్కడ కొన్నాళ్లు పెట్టి, అక్కడి నుంచి వివిధమార్గాల ద్వారా మిల్లులకు తరలిస్తునారు. ఈ బియ్యాన్ని కొంతమంది సివిల్ సైప్లెకి పెడుతుండగా, మరికొంత మంది ఇతర రాష్ర్టాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. డిఫాల్ట్ అయిన మిల్లుల్లోనూ ఈ దందా నడుస్తున్న తీరు.. ఆదివారం హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకోవడంతో వెలుగులోకి వచ్చింది. నిజానికి సన్నబియ్యం దందాను అరికట్టాల్సిన ఉమ్మడి జిల్లాల యంత్రాగం నిద్ర పోతున్నదనే విమర్శలతోపాటు అక్రమాలకు పూర్తిగా సహకరిస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చి టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకుంటుంటే.. స్థానికంగా ఉండే అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
345 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
హుజూరాబాద్ రూరల్, డిసెంబర్ 7: రెండు నెలల క్రితం హుజూరాబాద్ పట్టణ శివారులోని బాలాజీ ట్రేడర్స్‌లో 260 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్న రాష్ట్ర సివిల్ సైప్లె విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, టాస్‌ఫోర్స్ అధికారులు.. ఆదివారం మరో మిల్లుపై మెరుపుదాడి చేశారు. పక్కా సమాచారం మేరకు రంగంలోకి దిగారు. కరీంనగర్ రోడ్డులో ఉన్న వీరాంజనేయ ట్రేడర్స్ (శ్రీలక్ష్మి రైస్ మిల్లు) ఆవరణలో మూడు క్వింటాళ్ల రేషన్ బియ్యంను డంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్న రెండు ఆటోలను పట్టుకొని సీజ్ చేశారు. అనంతరం మిల్లు ఓపెన్ చేసి, అందులో ఉన్న అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 342 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకొన్నారు. ఆ తర్వాత సీజ్ చేసి, ఎంఎల్ఎస్ పాయింట్ అధికారులకు అప్పగించారు. మిల్లు యజమానిపై 6ఏ కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో సివిల్ సైప్లె అధికారులు ఓఎస్డీ ప్రభాకర్, ప్రత్యేకాధికారి లక్ష్మారెడ్డి, టాస్క్‌ఫోర్స్ సరిల్ ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్, ఎస్ఐ జంపయ్య, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.