నాలుగు దశాబ్ధాల క్రితం ముంపునకు గురైన ఎస్సారెస్పీ భూములపై అక్రమార్కులు కన్నేశారు. భూముల ధరలు ఆకాశన్నంటుతుండడంతో తాతలనాటి పట్టాలు వెతికి మరీ ఎసరు పెడుతున్నారు. ఈ క్రమంలో కొందరు అధికారుల సహకారంతో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో ఇలాంటి ఉదంతమే వెలుగు చూసింది. గుట్టుగా రిజిస్ట్రేషన్ చేసిన అనంతరం భూమికి హద్దులు ఖరారు చేసే క్రమంలో విషయం బయటపడింది. స్థానికుల ఫిర్యాదుతో కరీంనగర్ ఆర్డీవో మహేశ్ కుమార్ సర్వే నిలిపి వేయించగా, ఇలానే అనేక గ్రామాల్లో ఎస్సారెస్పీ భూములను అన్యాక్రాంతం చేస్తున్నట్టు తెలుస్తున్నది.
కరీంనగర్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన దిగువ మానేరు జలాయశం (ఎల్ఎండీ)లో 11 గ్రామాలు పూర్తిగా, మరి కొన్ని గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. అందులో నుస్తులాపూర్ గ్రామం ఒకటి! 1985-86 ప్రాంతంలో ఈ గ్రామ ముంపు బాధితులు పాత నుస్తులాపూర్ ఖాళీ చేసి, ఇదే గ్రామ శివారులో స్థిరపడ్డారు. బ్యాక్ వాటర్‌తో ఇబ్బందులుంటాయనే ఉద్దేశంతో ఈ జలాశయం 920 లెవల్ పరిధి దాటిన ఇండ్లకు కూడా కోర్టు ఆదేశాలతో అప్పుడు నష్ట పరిహారం చెల్లించారు. కానీ, కొన్ని ఇళ్ల స్థలాలను సేకరించ లేదు. ఈ విషయమై అప్పట్లో కోర్టులో దావా వేసినా.. అది ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నది. అయితే ముంపు బాధితులు 40 ఏళ్ల కింద వదిలేసిన స్థలాలను తమవిగానే భావిస్తున్నా, పట్టా సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్లు మాత్రం లేవు. ఎస్సారెస్పీ భూ సేకరణ విభాగం అధికారులు కూడా ఈ స్థలాలను సేకరించకపోవడంతో వాటిని పహాణీల నుంచి తొలగించలేదు. ఇదే అదునుగా కొందరు అక్రమార్కులు ఆ భూములపై కన్నేస్తున్నారు. కొందరు రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని, ఈ భూములకు సంబంధించిన పాత పహాణీల్లో ఉన్న పట్టాదారులు లేదంటే వారి వారసులను వెతికి పట్టుకొని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. తర్వాత వ్యవసాయ యోగ్యమైన ఈ భూములను లక్షలాది రూపాయలకు అమ్మేస్తున్నారు.
తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో సరిగ్గా ఇదే జరిగింది. ఈ గ్రామానికి చెందిన కొందరు రజకులు 90 ఏళ్ల కింద సర్వే నంబర్ 1111లో ఇండ్లు కట్టుకుని, సుమారు 50 ఏళ్లపాటు నివసించారు. అప్పట్లో వీరు సాదాబైనామా ద్వారా స్థలాలు కొన్నారు. అయితే ఈ భూములు జలాశయం 920 లెవల్‌కు వెలుపల ఉన్నాయని భావించిన అప్పటి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించ లేదు. దీంతో బ్యాక్ వాటర్ తమ ఇండ్లలోకి వస్తుందని, క్రిమికీటకాలతో తమకు ప్రాణభయం ఉందని వీరంతా కోర్టును ఆశ్రయించగా, 1994 ప్రాంతంలో అనుకూలంగా తీర్పు వచ్చింది. అప్పుడు ఇండ్లకు మాత్రమే నష్టపరిహారం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, వీరికి ఇంటి నంబర్ల మీద భూ సేకరణ చేసింది. ఒక్క 1111 సర్వే నంబర్‌లోనే 37 నివాస గృహాలకు పరిహారం చెల్లించింది. పరిహారం రావడంతో రజకులు ఈ భూములను వదిలేసి వెళ్లిపోయారు. అయితే 40 ఏళ్ల తర్వాత అంటే ప్రస్తుతం ఆ 2.20 ఎకరాల భూమికి ఇప్పుడు కొత్త పట్టాదారులు పుట్టుకొచ్చారు. రెవెన్యూ అధికారులే వీరికి రిజిస్ట్రేషన్ చేయడం ఆశ్చర్యంగా ఉన్నా.. ఇప్పుడు ఇదే సర్వే నంబర్ 1111/ఏ/1 డివిజన్‌గా విభజించి మరో వ్యక్తికి 60321 ఖాతా నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేశారు.
నుస్తులాపూర్ పరిధిలోని ఈ సర్వే నంబర్లోని కొంత భూమిని ప్రస్తుతం కొన్ని రజక కుటుంబాల వారు అనధికారికంగా సాగు చేసుకుంటున్నారు. ఈ భూమికి 90 ఏండ్ల కింద ఉన్న పట్టాదారు వారసులు ఇప్పుడు వేరే వ్యక్తికి కొంత భాగం అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. అతను తన భూమి హద్దులు ఖరారు చేయాలని సర్వే విభాగం అధికారులకు అర్జీ పెట్టుకున్నాడు. దీంతో చుట్టు పక్కల భూముల రైతులకు సదరు అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన రజకులు వెంటనే కలెక్టర్ సహా జిల్లా ఉన్నతాధికారులకు, ఆర్డీవో మహేశ్‌కుమార్‌కు నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ఈ భూమి సర్వేను నిలిపి వేసి, విచారణ జరపాలని తిమ్మాపూర్ తహసీల్దార్‌ను ఆర్డీవో ఆదేశించారు. దాంతో సర్వే నిలిపి వేశారు.
ప్రభుత్వం ముంపు భూములకు నష్టపరిహారం చెల్లించి స్వాధీనం చేసుకున్న తర్వాత సదరు యజమానులకు ఎలాంటి హక్కు ఉండదు. సాగు, రిజిస్ట్రేషన్ చేసే అవకాశముండదు. కానీ, ఇప్పుడు నుస్తులాపూర్ ముంపు భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారం అనేక అనుమానాలకు తావిస్తున్నది. 90 ఏండ్ల కింద ఉన్న పట్టాదారుల నుంచి కొందరు రజకులు 50 ఏండ్ల కింద భూములు కొని ఇండ్లు కట్టుకున్నారు. తర్వాత ఎల్ఎండీ ముంపు కారణంగా ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించడంతో ఆ భూములను వదిలేసి వెళ్లిపోయారు. అలాంటి భూములను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం అనేక సందేహాలను తెరపైకి తెస్తున్నది. చేతులు మారిన భూమిని, పైగా ముంపు పరిహారం చెల్లించిన భూమిని ఎలా రిజిస్ట్రేషన్ చేశారనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఆ భూమిని పాత పట్టాదారులకు విరాసత్ చేశారా..? మరోలా బదిలీ చేశారా..? అన్నది తెలియకుండా ఉన్నది. ఇలానే అనేక చోట్ల విలువైన ఎస్సారెస్పీ భూములు అన్యాక్రాంతం అవుతున్నా ఇటు రెవెన్యూ అటు ఎస్సారెస్పీ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటేనే ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.