తిమ్మాపూర్, ఆగస్టు 27: లారీలో కుక్కి అక్రమంగా 48 గోవులను తరలిస్తున్న నిందితులు ఎల్ఎండీ పోలీసులకు అడ్డంగా చిక్కారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా నుంచి 48ఆవులను ట్రక్కులో హైదరాబాద్ వైపు తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎల్ఎండీ పోలీసులు తిమ్మాపూర్ సమీపంలో పట్టుకున్నారు.
లారీలో గోవులు ఒకదానిపై ఒకటి పడి దీన స్థితిలో ఉండడంతో పోలీసులు వెంటనే ఎల్ఎండీలోని గోశాలకు తరలించారు. 48ఆవుల్లో ఊపిరాడక 4ఆవులు చనిపోయాయి. పశువైద్యులు చేరుకుని అపస్మారక స్థితిలో, అవస్థకు గురైన ఆవులకు చికిత్సనందించారు.
ట్రక్కును స్వాధీనం చేసుకుని డ్రైవర్ను ఎల్ఎండీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరు తరలిస్తున్నారు..? ఎక్కడికి తరలిస్తున్నారనే విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశువులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ చేరాలు హెచ్చరించారు.